తునికాకు సేకరణ పనులు వెంటనే చేపట్టాలి :  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

తునికాకు సేకరణ పనులు వెంటనే చేపట్టాలి :  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

హైదరాబాద్, వెలుగు: గిరిజనులు, గిరిజనేతర పేదలకు ఉపాధిని కల్పిస్తున్న తునికాకు సేకరణ పనులను వెంటనే చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటా జనవరి నాటికే టెండర్ల ప్రక్రియను అటవీ శాఖ పూర్తి చేస్తుందని, కానీ, ఈ ఏడాది తాత్సారం చేసిందని తెలిపారు. టెండర్ల పనులు పూర్తవ్వకపోవడంతో ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్‌‌‌‌ చేశారు.

రాష్ట్రంలో14 జిల్లాల్లో తునికాకు సేకరణను అటవీశాఖ చేపడుతుంది. దాదాపు10 లక్షల మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏటా తునికాకు టెండర్ల ప్రక్రియను  పూర్తి చేసిన తర్వాత ఫిబ్రవరిలో పూనింగ్‌‌‌‌ చేస్తారని, ఫలితంగా ఎక్కువగా దిగుబడి వస్తుందని వెల్లడించారు.  కానీ, ఈ పని సకాలంలో జరగలేదని, అటవీశాఖ అలసత్వం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. సీజన్​లో వచ్చే ఆదాయంతో గిరిజనులు అనేక ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తారని తెలిపారు.

తునికాకు దొరికే ప్రాంతాల్లో కార్మికులు, గిరిజనులు ఉపాధి కోల్పోకుండా చర్యలు చేపట్టాలని, టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించకపోతే అటవీశాఖ ద్వారానైనా సేకరించడానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.