
- కాసాని ఐలయ్య సంస్మరణ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
సుజాతనగర్, వెలుగు : అమరజీవి కాసాని ఐలయ్య పోరాటాల స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కాసాని ఐలయ్య సంస్మరణ సభ నిర్వహించారు.
ముందుగా సుజాతనగర్ మెయిన్ రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించి అనంతరం కాసాని ఐలయ్య దంపతుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, ఆదివాసీలు, మహిళలు బలహీన వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఈ దాడులను ప్రతిఘటిస్తూ సామాజిక న్యాయం కోసం అభ్యుదయ శక్తులన్నింటినీ ఐక్యం చేసేందుకు సీపీఎం కృషి చేస్తోందని తెలిపారు.
కాసాని ఐలయ్య జీవితకాలం శ్రామిక వర్గం అభ్యున్నతి కోసం, అట్టడుగు ప్రజల అభివృద్ధి కోసం పనిచేశారని, ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కాసాని ఐలయ్య ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడని కొనియాడారు. కొత్తగూడెం ప్రాంతంలో ఉద్యమాన్ని నిర్మించడంలో కాసాని అనేక ఆటుపోట్లను, నిర్బంధాలను ఎదుర్కొని ముందుకు సాగాడని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బి వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేశ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, కే బ్రహ్మచారి, అన్నవరపు సత్యనారాయణ, లిక్కి బాలరాజు, పార్టీ మండల కార్యదర్శి వీర్ల రమేశ్ తదితులు పాల్గొన్నారు.