ఆర్టీసీ బస్సులు, మెట్రో బోగీలు పెంచాలె : తమ్మినేని వీరభద్రం

ఆర్టీసీ బస్సులు, మెట్రో బోగీలు పెంచాలె : తమ్మినేని వీరభద్రం
  • సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం నేత తమ్మినేని లేఖ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను, మెట్రో రైల్ బోగీలను పెంచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమలుచేస్తూ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని గుర్తుచేశారు. స్టేట్​లో 4 కోట్ల మంది ప్రజలు ఉంటే.. ఒక్క హైదరాబాద్​ నగరంలోనే 1.10 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. 

ప్రయాణికుల సంఖ్య రోజుకు 30 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగినప్పటికీ, ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరగలేదని తెలిపారు. ఉచిత ప్రయాణ పథకం తర్వాత 100 బస్సులు మాత్రమే పెంచారని గుర్తుచేశారు. కాబట్టి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బస్సుల సంఖ్య పెంచాలని, రద్దీ రూట్లలో తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. నగరంలో మెట్రో రైళ్లు కూడా కిక్కిరిసి నడుస్తున్నాయని, దీంతో పీక్ టైంలో రైలు ఎక్కడం, దిగడం కూడా కష్టంగా మారిందని తెలిపారు. మెట్రో రైళ్ల బోగీల సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నా ఎల్​అండ్ టీ సంస్థ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే మెట్రో రైళ్ల బోగీల సంఖ్యను పెంచి, ఎంఎంటీఎస్ రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని సీఎంను తమ్మినేని రిక్వెస్ట్ చేశారు.