- కలెక్టర్, అధికారులపై దాడి కరెక్ట్ కాదు
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21న వామపక్ష నేతలతో కలిసి లగచర్లకు వెళ్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. రైతులకు అండగా నిలవడంతోపాటు బాధిత కుటుంబాలనుపరామర్శిస్తామన్నారు.సోమవారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. " ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయటం కరెక్ట్ కాదు. వికారాబాద్ జిల్లాలో ఫార్మా సంస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరిస్తున్నది.
అయితే, సేకరణలో ప్రజా ప్రజాస్వామ్య పద్ధతిని పాటించకుండా ఏకపక్షంగా ముందుకెళ్లడం కూడా సరికాదు. సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేది. 21న లగచర్లకు వెళ్లి బాధిత రైతాంగాన్ని కలిసి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని వారికి న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరతామన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన, దామగుండం రాడార్ స్టేషన్ ఏర్పాటు, గ్రూప్-1 వివాదం, ఫార్మాసిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకోవడం లేదు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమో సీఎం ఆలోచించాలి. మూసీ పరిధిలో ఆక్రమించిన వాటిని తొలగిస్తే అభ్యంతరం లేదు. కానీ పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చడం సరికాదు" అని తమ్మినేని అన్నారు.