కాంగ్రెస్​ అభ్యర్థి మల్లన్నకే సీపీఎం మద్దతు : జూలకంటి రంగారెడ్డి

  •     రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి 

నల్లగొండ అర్బన్, వెలుగు :  నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకే తమ మద్దతు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.

దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా దేశంలో మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పట్టభద్రులందరూ ఇండియా కూటమి అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిపించేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, డంబికార్ మల్లేశ్, పాలడుగు ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, దండంపల్లి సత్తయ్య, ఖమ్మంపాటి శంకర్, ఆకారపు నరేశ్, మంగారెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.