MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు

హైదరాబాద్/వరంగల్, వెలుగు : నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ కు జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతిస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం దేశంలో ఇండియా కూటమి ఏర్పడిందని, దాంట్లో సీపీఎం, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు గానూ.. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. 

టీచర్ సెగ్మెంట్ కూడా.. 

వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతిస్తున్నట్టు వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల టీచర్ సెగ్మెంట్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు మల్లన్నకు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడే పార్టీగా ఉందని గుర్తుచేశారు. బీజేపీ మాత్రం ప్రజల మధ్య మతం పేరిట చిచ్చుపెడుతూ, బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదని విమర్శించారు.