- బీఆర్ఎస్ బాధ్యతారాహిత్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది..
- రూ. లక్ష కోట్లు నీళ్ల పాలు
- సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి
- చరిత్ర సృష్టించడం కోసం కేసీఆర్ తప్పు చేశారు
- మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీపీఎం బృందం వ్యాఖ్యలు
జయశంకర్ భూపాలపల్లి/మహాదేవ్‌పూర్, వెలుగు : ‘బీఆర్‌ఎస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే రూ. మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. లక్ష కోట్ల ప్రజాధనం నీళ్ల పాలైంది. దీనిపై న్యాయ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలి. రాష్ట్రంలో కరువు నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి రైతులకు సాగునీరిందించే ఏర్పాట్లు చేయాలి’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గొల్లపల్లి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ తో కలిసి ఆ పార్టీ బృందం సందర్శించింది. బ్యారేజీలోని 7వ బ్లాక్‌లో కుంగిన 19,20,21 పిల్లర్లను బ్యారేజీ పై నుంచి క్రాక్స్ వచ్చిన ప్రాంతాలను పరిశీలించారు. అప్ స్ట్రీం వైపు కిందికి దిగి నడుచుకుంటూ వెళ్లి క్రాక్స్ ఏర్పడిన పిల్లర్లతో పాటు బ్లాక్ మొత్తాన్ని పరిశీలించారు.
కాంట్రాక్టర్లతో బీఆర్ఎస్ కుమ్మక్కు
సీపీఎం లీడర్లు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపులు పొందండం వల్లే ఖరీదైన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారి రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిందని మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వద్ద తాత్కాలిక ఏర్పాట్లు చేసి సాగునీరందించాలన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తన కలల ప్రాజెక్టు కాళేశ్వరం అని గొప్పలు చెప్పుకున్నారని, ఆ ప్రాజెక్టు తక్కువ కాలంలోనే కుంగిపోవడం దారుణమైన విషయమన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టే ముందు అఖిలపక్షం, నిపుణులతో కమిటీ వేసి నిర్మాణం చేపట్టవలసి ఉండేదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్చరిత్ర సృష్టించడం కోసం చేసిన తప్పిదం వల్ల ప్రజాధనం వృథా అయ్యిందన్నారు.
ప్రాజెక్టు డిజైన్ లోపమా? లేక నిర్మాణ లోపమా? అనేది నిపుణుల కమిటీ వెంటనే తేల్చాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ బాధ్యులైన ఎల్అండ్ టీతో పాటు గత ప్రభుత్వం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. బీఆర్ఎస్ ప్రాజెక్టు ను రిపేర్చేయాలని అంటోందని, ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఉంచాలా లేక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించాలా అన్న విషయాన్ని ఆలోచిస్తోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు, సీపీఎం పట్టణ అధ్యక్షుడు వెలిశెట్టి రాజయ్య, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పోలెం రాజేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పోలం చిన్న రాజేందర్, పాల్గొన్నారు.