సీపీఎం బృందం పర్యటన.. తెల్దారుపల్లిలో ఉద్రిక్తత

ఖమ్మం రూరల్​, వెలుగు : గత నెల 15న టీఆర్ఎస్​ నాయకుడు, ఆంధ్రాబ్యాంక్​ సొసైటీ డైరెక్టర్​ తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గ్రామంలో ఉద్రిక్త వాతావరణమే కొనసాగుతోంది. గురువారం మండలంలోని తెల్దారుపల్లికి సీసీఎం బృందం వస్తుందనే సమాచారంతో కృష్ణయ్య అనుచరులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సీపీఎం బృందం గ్రామానికి రావడానికి వీల్లేదని నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. సీపీఎం లీడర్లు గ్రామంలో ఉన్న ప్రశాంతతకు భంగం కలిగించడానికే వస్తున్నారని ఆరోపించారు.

కృష్ణయ్య కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వారిని ఊర్లోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి చూపించాల్సింది పోయి హత్య చేసిన వారి ఫ్యామిలీలను పరామర్శించేందుకు రావడమేమిటన్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు వినకుండా ఖమ్మం–సూర్యాపేట రోడ్డుపై ఆందోళన చేసేందుకు బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తర్వాత సీసీఎం రాష్ట్ర అధ్యక్షుడు తమ్మినేని వీరభ్రదం కడుతున్న ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. రూరల్ ​ఏసీపీ వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఏసీపీ బస్వారెడ్డి సీసీఎం బృందాన్ని ఊర్లోకి రానివ్వమని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

వీరభద్రమే హత్య చేయించిండు : తమ్మినేని నవీన్
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రమే తన తండ్రిని హత్య చేయించాడని తమ్మినేని కృష్ణయ్య కొడుకు నవీన్ ఆరోపించారు. తెల్దారుపల్లిలో మాట్లాడుతూ ఏ రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్నామని తన తండ్రిని చంపించారో  ఆ రాజకీయాన్ని వారికి దక్కనివ్వనని ప్రతిజ్ఞ చేశారు. రాబోయే ఎన్నికల్లో సీపీఎంకు ఒక్క ఓటు పడనివ్వమన్నారు. తన తండ్రి మృతి చెందిన రోజే తన ప్రాణంపై ఆశను వదిలేశానన్నారు. తమ్మినేని వీరభద్రం, తమ్మినేని కోటేశ్వరరావు ఇద్దరూ తనకు శత్రువులేనని అన్నారు. సీపీఎం నాయకులను తెల్దారుపల్లిలో అడుగు పెట్టనివ్వనని అన్నారు.