హైదరాబాద్/యాదాద్రి, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీలోనే ఉండాలని సీపీఎం నిర్ణయించింది. మిగిలిన16 లోక్ సభ స్థానాల్లో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని డిసైడ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి శనివారం సీపీఎం నేతలతో సమావేశమై అన్ని ఎంపీ సీట్లలోనూ తమకు మద్దతివ్వాలని కోరారు. భువనగిరిలో పోటీ నుంచి తప్పుకోవాలన్నారు. అనంతరం సీఎంతో జరిగిన చర్చలపై సీపీఎం ముఖ్య నేతలు సమావేశమయ్యారు. నామినేషన్ వేసిన తర్వాత పోటీలోంచి తప్పుకుంటే క్యాడర్ లో, ప్రజల్లో చులకన అవుతామని ఎక్కువ మంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదే విషయాన్ని తెలియజేస్తూ సీపీఎం కేంద్ర కమిటీకి లేఖ రాయగా, ఆదివారం రాష్ట్ర కమిటీకి రిప్లై లేఖ వచ్చింది. భువనగిరిలో పోటీ చేయాలనే నిర్ణయాన్ని కొనసాగించాలని, మిగిలిన చోట్ల మాత్రం ఇండియా కూటమికి సపోర్ట్ చేయాలని కేంద్ర కమిటీ సూచించింది. దీనిపై ఆదివారం సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సమక్షంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. కేంద్ర కమిటీ నిర్ణయాన్ని అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశం తర్వాత సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. భువనగిరిలో సీపీఎం పోటీలో ఉంటుందని ప్రకటించారు.
ఇక్కడ తమ అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. దీంతో భువనగిరిలో సీపీఎం నామినేషన్ వాపస్ తీసుకుంటుందా? లేదా ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తుందా? అన్నదానిపై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. భువనగిరిలో తాము ప్రెండ్లీ కాంటెస్ట్‌లో పోటీ చేయడం లేదని డైరెక్ట్ పోటీలోనే ఉంటున్నామని యాదాద్రి జిల్లా సీపీఎం లీడర్ ఒకరు తెలిపారు. తమకు కాంగ్రెస్ ఎక్కడో ఒక చోటైనా మద్దతిచ్చి ఉం టే.. ఇక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ కు చాన్స్ ఉండేదన్నారు.