
- మే 1న చలో ఢిల్లీ సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వెల్లడి
- సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద యుద్ధభేరీ
హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్లకు లాభం చేకూర్చడానికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) విధానాన్ని తీసుకొచ్చిందని నేషనల్ మూవ్ మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సెక్రటరీ జనరల్, సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలు చేయాలని పదేండ్లుగా కోరుతున్నా.. కేంద్రం యూపీఎస్ తీసుకొచ్చిందని, దీన్ని తాము ఒప్పుకోబోమని ఆయన స్పష్టం చేశారు.
యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్1న బ్లాక్ డే గా పరిగణించి, దేశంలోని అన్ని జిల్లాల నుంచి ప్రధాని మోదీకి లేఖలు రాస్తూ.. కలెక్టర్లకు వినతిపత్రాలు అందిస్తామని చెప్పారు. యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ధర్నాచౌక్ లో యుద్ధభేరీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మే1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో మార్పు రాకుంటే సెప్టెంబర్ 1న సీపీఎస్ ఉద్యోగులంతా సామూహికంగా సెలవు పెట్టి, హైదరాబాద్ లో లక్ష కలాలతో కవాతు నిర్వహిస్తామని హెచ్చరించారు.
పదేండ్లుగా సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్నామని, తద్వారా గ్రాట్యూటీ, ఫ్యామిలీ పింఛన్ సాధించుకున్నామని తెలిపారు. జనవరిలో సీపీఎస్ విధానంలో రిటైర్ అయిన హైకోర్టు జడ్జికి నెలకు రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకూ, డీఎస్సీ 2003 టీచర్లకు రూ.2 వేల నుంచి రూ.5 వేల లోపే పింఛన్ వస్తుందన్నారు. ఈ డబ్బుతో కుటుంబాన్ని ఎలా నడపాలని ఆయన ప్రశ్నించారు. సామాజిక భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు.. కార్పొరేట్ల కడుపు నింపే విధంగా తయారయ్యాయని మండిపడ్డారు.
సీపీఎస్ విధానం రద్దుతో రాష్ర్టాలకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్, చత్తీస్ గఢ్, ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ పథకం అమలు చేస్తున్నారని చెప్పారు. కాగా..ఈ కార్యక్రమంలో సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, ట్రెజరర్ నరేష్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూరాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.