ఓఆర్ఆర్​ వద్ద సైకిల్ ​ట్రాక్​కు పగుళ్లు!..

ఓఆర్ఆర్​ వద్ద సైకిల్ ​ట్రాక్​కు పగుళ్లు!..
  • కిలోమీటర్ ​మేర ట్రాక్​పై క్రాక్స్​
  • నానక్​రామ్​ గూడ నుంచి ఓఆర్ఆర్​ఇంటర్ ఛేంజ్​ వరకు నిర్మాణం
  • 23 కిలోమీటర్లకు రూ. 93 కోట్ల ఖర్చు

హైదరాబాద్​సిటీ,వెలుగు : మూడేండ్ల కింద అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం ఔటర్​రింగ్​రోడ్​ను ఆనుకుని హైటెస్​సిటీ వద్ద నానక్​రామ్​గూడ నుంచి ఓఆర్​ఆర్​ ఇంటర్​ఛేంజ్ వరకూ 23 కి.మీ. మేర నిర్మించిన సైకిల్​ ట్రాక్​పై పగుళ్లు ఏర్పడ్డాయి. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్​ఈ సైకిల్​ ట్రాక్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేశారు. ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. అప్పటి  నుంచి ఈ ట్రాక్​ను సైకిలిస్టులు ఉపయోగిస్తున్నారు.

సైకిల్​తొక్కే వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నగరంలో అప్పట్లో పలు ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదట్లో హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్డులో రెండు వైపులా లైన్​మార్కింగ్ చేశారు. సంజీవయ్య పార్క్ వద్ద ప్రత్యేకంగా సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేశారు. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ సైడ్ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. హైటెక్స్ కమాన్ నుంచి ఎన్ఏసీ వరకు ట్రాక్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఔటర్​రింగ్​రోడ్​ఆనుకుని నానక్​రామ్​గూడ వద్ద నిర్మించిన సైకిల్​ ట్రాక్​పై పగుళ్లు వచ్చాయి. ఇవి సుమారు కిలోమీటర్​వరకు విస్తరించాయి. దీంతో సైకిలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కిలోమీటర్​కు రూ. 4 కోట్లు ఖర్చు 

ఐటి కారిడార్​లో పనిచేసే ఉద్యోగులు, సైక్లింగ్​అంటే ఇష్టపడే వారు, ఫిట్​నెస్​కోసం సైకిల్​తొక్కే వారి కోసం నానక్​రామ్​గూడ నుంచి ఓఆర్ఆర్​ఇంటర్​ఛేంజ్ వరకు సైకిల్​ట్రాక్​ను రూ. 93 కోట్లతో నిర్మించారు. కిలో మీటర్​కు 3.91 కోట్లు ఖర్చయ్యింది. అంతర్జాతీయ స్థాయిలో ట్రాక్ నిర్మిస్తామంటూ ప్రపంచంలోనే అత్యున్నత సైకిల్ ట్రాక్ లను పరిశీలించేందుకు అధికారులు  దక్షిణ కోరియా...సౌదీల్లో పర్యటించారు.

ఆయా ప్రాంతాల్లోని ముఖ్యమైన అంశాలను తీసుకొని ఔటర్ రింగ్ రోడ్డువద్ద  సైకిల్ ట్రాక్ కు రూపకల్పన చేశారు. 4.5 మీటర్ల వెడల్పుతో మూడు లైన్ల ట్రాక్ సిద్ధం చేశారు. నానక్ రామ్ గూడ నుంచి అప్పా జంక్షన్ ,కోల్లూర్ నుంచి నార్సింగ్ వరకు 23 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉండగా 21 కిలోమీటర్ల మేర సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పుడు కిలోమీటర్​మేర ట్రాక్​దెబ్బతినడంతో మిగతా ట్రాక్​పరిస్థితి ఎలా ఉంటుందోనని సైకిలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.