- 2019 నవంబర్లోనే లోపాల గుర్తింపు పట్టించుకోని అప్పటి బీఆర్ఎస్ సర్కార్
- ఎల్అండ్టీతో రిపేర్లు చేయించడంలో ఫెయిల్
- పైగా కాస్ట్ ఎస్కలేషన్ పేరుతో సంస్థకు
- రూ.1,200 కోట్ల అదనపు చెల్లింపులు
- డిజైన్, నిర్మాణం, మెటీరియల్,
- మెయింటనెన్స్‌లో లోపాలు
- కోర్డ్రిల్లింగ్తో మెటీరియల్ శాంపిల్స్ సేకరణ
- విజిలెన్స్ ఎంక్వైరీలో వెలుగులోకి వాస్తవాలు
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ అన్ని బ్లాకుల్లోనూ పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్అండ్ఎన్ఫోర్స్మెంట్ ఫీల్డ్ విజిట్‌లో తేటతెల్లమైంది. ఆరు నుంచి ఎనిమిది బ్లాకుల్లో డ్యామేజీలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని.. మిగతా ఐదు బ్లాకుల్లోని పిల్లర్లలోనూ పగుళ్లు ఉన్నాయని నిర్ధారించారు. అయితే ఈ లోపాలను నాలుగేండ్ల కిందనే ప్రాజెక్టు ఇంజినీర్లు గుర్తించి.. రిపేర్లు చేసి సరిదిద్దాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి లేఖ రాశారు. కానీ నిర్మాణ సంస్థ వాటిని సరిచేయలేదు. సంస్థతో పనులు చేయించాల్సిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అలాగే డిజైన్, నిర్మాణం, మెటీరియల్, మెయింటనెన్స్ లోపంతోనే భారీ నష్టం వాటిల్లిందని విజిలెన్స్ గుర్తించింది. ఇలా గత సర్కార్ అంతులేని నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీకి ఈ పరిస్థితి వచ్చిందని ఇంజనీర్లు అంటున్నారు.
ప్రారంభించిన నాలుగు నెలలకే
2019 జూన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభిస్తే అదే ఏడాది నవంబర్‌లో ప్రాజెక్టు ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజీలో లోపాలను గుర్తించారు. ఆ ఏడాది బ్యారేజీకి వచ్చిన వరదలతో సీసీ బ్లాకులు నదిలో కొట్టుకుపోయాయని, అలాగే బ్యారేజీలో పలు లోపాలు కనిపించాయని గుర్తించారు. అయినా వాటిని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీతో సరి చేయించడంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. దీంతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయే పరిస్థితి తలెత్తింది. 2022 ఆగస్టులో మేడిగడ్డ బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. ఆ వరద కారణంగానే బ్యారేజీ డ్యామేజీలు పెరిగినట్టు గత ప్రభుత్వ పెద్దలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ 2022 ఏప్రిల్ 28న బ్యారేజీలో లోపాలు సరిదిద్దాలని కోరుతూ ఎల్అండ్టీకి ఇంజనీర్లు లేఖ రాశారు. బ్యారేజీలో ఐదు పనులు పెండింగ్‌లో ఉన్నాయని, 10 పనులు డ్యామేజీ అయినందున వాటిని సరి చేయాలని ఆ లేఖలో కోరారు. బ్యారేజీ బెడ్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించాలని, అక్కడ పేరుకుపోయిన కాంక్రీట్, ఎర్త్వర్క్స్, వ్యూమ్పైప్లు సహా ఇతర లోపాలను సరి చేయాలని, కాంక్రీట్బ్లాకులను యథాస్థానంలో పెట్టాలని కోరారు. ఏడోబ్లాక్‌లోని 17 నుంచి 20వ వరకు వెంట్స్దిగువన నీటి బుంగలు ఏర్పడ్డాయని, వాటిని గ్రౌటింగ్చేయకపోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. అప్పుడే ఎల్అండ్టీతో రిపేర్లు చేయించి ఉంటే బ్యారేజీ కుంగిపోయేది కాదని గుర్తించారు. 2019లో బ్యారేజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫీల్డ్ఇంజనీర్లు, బ్యారేజీ నిర్వహణ బాధ్యతల్లో ఉన్న ఎల్అండ్టీ వర్షాకాలం ప్రారంభానికి ముందు, తర్వాత చేపట్టాల్సిన తనిఖీలు చేయలేదని విజిలెన్స్గుర్తించింది.
నాణ్యతలేని మెటీరియల్?
బ్యారేజీ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్లోనూ నాణ్యత లేదని విజిలెన్స్అధికారులు సందేహిస్తున్నారు. మూడు రోజులుగా మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్‌తో పాటు పిల్లర్లను కోర్ డ్రిల్లింగ్ చేసి శాంపిల్స్ సేకరిస్తున్నారు. వాటిని హైదరాబాద్‌లోని వేర్వేరు ల్యాబులకు పంపి నిర్దేశిత ప్రమాణాల మేరకు సిమెంట్, కాంక్రీట్, ఐరన్ఉపయోగించారా.. ఏమైనా అక్రమాలు జరిగాయా అనేది నిర్దారించనున్నారు. పగుళ్లు ఏర్పడిన ఏడో బ్లాకులోని 20వ నంబర్పిల్లర్ను తాము పరిశీలిస్తున్నప్పుడు అందులో 40 ఎంఎం కాంక్రీట్‌కు బదులుగా 20 ఎంఎం కాంక్రీట్వాడినట్టుగా గుర్తించామని విజిలెన్స్అధికారులు చెప్తున్నారు. మేడిగడ్డ దెబ్బతినడానికి ప్రధాన కారణాల్లో దానికి ఎగువన నిర్మించిన కాఫర్‌డ్యాం (మట్టికట్ట) తొలగించకపోవడం ఒకటని గుర్తించారు. బ్యారేజీకి ఎగువన నిర్మించిన కాఫర్డ్యాంలోని మట్టి వరద ఉధృతికి చాలా వరకు కొట్టుకుపోయినా ఆరు నుంచి ఎనిమిదో బ్లాక్ వరకు అలాగే ఉండిపోయిందని గుర్తించారు. దీంతో వరద తీవ్రతను ఇంకా పెరిగిందని, ఆ కారణంగానే మూడు బ్లాకుల్లో భారీ డ్యామేజీలు ఏర్పడ్డాయని నిర్దారణకు వచ్చారు. ప్రాజెక్టు ఇంజనీర్లు కాఫర్‌డ్యాం తొలగించినట్టుగా చెప్తుండటంతో వాస్తవాలను గుర్తించేందుకు నేషనల్రిమోట్సెన్సింగ్ఏజెన్సీకి విజిలెన్స్అధికారులు లేఖ రాశారు. 2018 నుంచి 2023 అక్టోబర్ నెలాఖరు వరకు శాటిలైట్మ్యాప్స్ఇవ్వాలని లేఖలో కోరారు. బ్యారేజీకి ఎగువ, దిగువన ప్రవాహం నుంచి కోతకు గురికాకుండా రక్షణగా ఏర్పాటు చేసిన భారీ సిమెంట్బ్లాకులు కొట్టుకుపోయినా వరద తగ్గిన తర్వాత వాటిని యథాస్థానంలో ఏర్పాటు చేయలేదని, ఆ నిర్లక్ష్యం కూడా ముంచేసిందని అంచనాకు వస్తున్నారు.
ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయింది?
మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తయినట్టుగా ప్రాజెక్టు ఇంజనీర్లు నిర్మాణ సంస్థకు వేర్వేరు తేదీల్లో సర్టిఫికెట్లు ఇచ్చారని విజిలెన్స్ఎంక్వైరీలో తేలింది. 2020 ఫిబ్రవరి 29న నిర్మాణం పూర్తయిందని, ఆ రోజు నుంచి డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్(ఏదైనా లోపాలు తలెత్తితే నిర్మాణ సంస్థనే ఖర్చు భరించి రిపేర్లు చేసే కాలం) ప్రారంభమైందని ఎల్అండ్టీ సంస్థ ప్రాజెక్టు ఇంజనీర్లకు లేఖ రాసింది. 2021 మార్చి 15న మేడిగడ్డతో పాటు బ్యారేజీకి సంబంధించి పనులన్నీ పూర్తయ్యాయని ప్రాజెక్టు ఇంజనీర్లు వర్క్ కంప్లీట్సర్టిఫికెట్ఇచ్చారు. అంతకు ముందే 2019 నవంబర్లోనే బ్యారేజీలో లోపాలున్నాయని, వాటిని రిపేర్చేయాలని ప్రాజెక్టు ఇంజనీర్లు ఎల్అండ్టీకి లేఖ రాశారు. ఆ లేఖలు ఎల్అండ్టీ పట్టించుకోకున్నా అప్పటి ప్రభుత్వం చూసిచూడనట్లు వదిలేసింది. పైగా 2021 తర్వాత కాస్ట్ఎస్కలేషన్పేరుతో నిర్మాణ సంస్థకు రూ.1,200 కోట్ల అదనపు చెల్లింపులు చేసిందని విజిలెన్స్ గుర్తించింది. ఈ క్రమంలో ట్రెజరీ నుంచి ఎల్అండ్టీకి, ఎల్అండ్టీ నుంచి సబ్ కాంట్రాక్టర్ల మధ్య జరిగిన మనీ ఫ్లోటింగ్పై ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టింది.
దీనికి సంబంధించిన పూర్తి డేటా ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరింది. ఏటా నవంబర్, డిసెంబర్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత బ్యారేజీలో లోపాలను గుర్తించి వాటి రిపేర్లు చేయాలని నిర్మాణ సంస్థ కోరాల్సి ఉన్నా.. దానికి విరుద్ధంగా ప్రాజెక్టు ఇంజనీర్లు ఏటా వర్షాకాలం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే లోపాలను సరి చేయాలని లేఖలు రాసినట్టు గుర్తించారు. అంత స్వల్పకాలంలో రిపేర్లు సాధ్యం కాదని తెలిసినా లేఖలు రాయడంపై ఆరా తీస్తున్నారు. బ్యారేజీ డ్యామేజీకి అంతులేని మానవ నిర్లక్ష్యం కూడా కారణమని గుర్తించారు. బ్యారేజీకి సంబంధించిన అనేక రికార్డులు మాయమయ్యాయని, అవి ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు ఇంజనీర్లు ఎల్అండ్టీకి లేఖలు రాస్తున్నారని, మరికొంత డేటా దొరకడమే లేదని అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు రెండు నెలలకు పైగా టైం పడుతుందని అధికారులు చెప్తున్నారు.