
- ఎప్పుడు ఏం కూలుతుందోనని ఉద్యోగుల్లో భయాందోళనలు
- లోపాలపై మంత్రి కోమటిరెడ్డి, స్పెషల్సీఎస్వికాస్రాజ్ సీరియస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సచివాలయంలో ఎక్కడ చూసినా పగుళ్లే కనిపిస్తున్నాయి. బయటకు కనిపించేది పీఓపీ అని చెబుతున్నా.. లోపల కాంక్రీట్బిల్డింగ్ ఎలా ఉందోననే ఆందోళన సెక్రటేరియేట్ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది.
ఒక్క ఐదో ఫ్లోర్లోనే పిల్లర్ల చుట్టూ ఉన్న పీఓపీలో పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బుధవారం సీఎం చాంబర్ఉండే అంతస్తు నుంచి రైలింగ్పట్టి కూలడంతో రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వెహికల్ డ్యామెజ్ అయిన విషయం తెలిసిందే.
దీంతో ఏ పక్క నుంచి ఏం కూలుతుందోనని ఉద్యోగులు భయంతో సెక్రటేరియెట్ వెళ్తున్నారు. 2019 జూన్ 27న మాజీ సీఎం కేసీఆర్ భూమిపూజ చేసి నిర్మాణాన్ని ప్రారంభించగా.. 2023 ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం చేశారు. అయితే, రెండేండ్లు కాకముందే బిల్డింగ్నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ బిల్డింగ్ నిర్మాణ బాధ్యతల్ని షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ సంస్థకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కాగా.. దీని నిర్మాణం కోసం ఏకంగా రూ.1,200 కోట్లు ఖర్చు చేశారు. ఇంతా చేసిన బిల్డింగ్ నాణ్యతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో బిల్డింగ్ నిర్మాణంలో లోపాలపై పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని ఇంజినీర్లకు ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం రైలింగ్ పట్టి కూలి 24 గంటలైనా ఇంకా అధికారులు నివేదిక ఇవ్వకపోవడంపై సీరియస్ అయినట్లు తెలిసింది.
ఆరు అంతస్తులు అని చెప్పుకుంటున్నప్పటికీ సరిపడా చాంబర్లు, పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఖర్చు పెంచుకుంటూ పోయిన్రు
గత ప్రభుత్వం రాష్ట్ర సచివాలయ నిర్మాణ ఖర్చును రూ.400 కోట్ల నుంచి మొదలు పెట్టి రూ.617 కోట్లకు పెంచేసింది. అనంతరం రూ.617 కోట్ల నుంచి రూ.1,140 కోట్ల వరకు అంచనాలు పెంచి ఖర్చు చేసింది.
సెక్రటేరియెట్‌లో ఐటీ పరికరాల కొనుగోళ్ల కోసం తొలుత రూ.181 కోట్ల అంచనా వేసి దాన్ని రూ.361 కోట్లకు పెంచారు. సచివాలయం నిర్మాణం కోసం అంచనాల కంటే రూ.523 కోట్లు, ఐటీ పరికరాల కొనుగోలుకు అంచనాల కంటే రూ.180 కోట్లు అధిక ఖర్చు చేశారు.
ఈ బాగోతంపై విజిలెన్స్ నిగ్గు తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి రిపోర్ట్ విజిలెన్స్ నుంచి రాలేదని తెలుస్తోంది.
మంత్రి ఆగ్రహం
స్టేట్ సెక్రటేరియెట్ నాణ్యతా లోపాల నేపథ్యంలో దాన్ని నిర్మించిన షాపూర్ జీ పలోంజి కంపెనీ ప్రతినిధులపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం చేశారు. భవనం రెయిలింగ్ కూలిన ఘటనపై వివరణ ఇచ్చేందుకు సంస్థ ప్రతినిధులు మంత్రిని కలవగా.. కోమటి రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కేంద్ర స్థానమైన భవనాన్నే ఇలా కడితే మిగతా వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏది ఏమైనా నాణ్యతా లోపాలుంటే సదరు సంస్థ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. స్పెషల్సీఎస్వికాస్రాజ్ కూడా స్టేట్ సెక్రటేరియెట్ నాణ్యతా లోపాలపై ఫైర్ అయ్యారు.