తమిళనాడులోని ఓ ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో క్రేన్ కూలి నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. రాణిపేటలోని ద్రౌపతి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం (జనవరి 22) రాత్రి 8.15 గంటల ప్రాంతంలో క్రేన్ పై అమ్మవారి విగ్రహాలు ఉన్న సమయంలో ఒక్కసారిగా కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పొంగల్ తర్వాత జరిగే ద్రౌపతి అమ్మన్ ఉత్సవాల్లో భాగంగా ఈ ఊరేగింపు జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో క్రేన్ పై కొందరు వేలాడుతుండగా.. మరికొందరు నేలమీద పడిపోతున్నట్లు కనిపిస్తోంది.
క్రేన్ ఒక్కసారిగా కూలిపోవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ నిలిపిన చోట భూమి చదునుగా లేకపోవడంతోనే బోల్తా పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆలయ ఉత్సవాల్లో క్రేన్ ఉపయోగించేందుకు అనుమతి తీసుకోలేదని పోలీసులు చెప్పారు.