- సాగు చేసేందుకు వెనుకాడుతున్న రైతులు
- ఈసారి 11,383 ఎకరాల్లోనే సన్నాలు
- 2.80 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం
యాదాద్రి, వెలుగు : సన్నాల సాగు ఏటేటా తగ్గుతోంది. పెట్టుబడి పెరగడం, దిగుబడి తగ్గడంతో పాటు సన్నాల కొనుగోలులో మిల్లర్లు కొర్రీలు పెడుతుండడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడేండ్ల కింద 86,500 ఎకరాల్లో సాగైన సన్నాలు ఈ సారి 11,338 ఎకరాలకు పడిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సన్నాల వాడకం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటోంది. ప్రతిఏటా సన్న బియ్యం తినేవారు పెరుగుతున్నారు. అదే దొడ్డు రకం వడ్లు మూడేండ్ల కింద 1,10,000 ఎకరాల్లో సాగు జరగగా... ఈ సారి 2,77,987 ఎకరాలకు పెరిగాయి.
ఇబ్బందులు పడలేక..
సన్న వడ్ల అమ్మకంలో కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న రైతులు ఈసారి సన్నొడ్ల సాగు పూర్తిగా తగ్గించేశారు. దొడ్డు రకం కంటే సన్నాల సాగుకు పెట్టుబడి పెరగడంతో పాటు దిగుబడి తగ్గుతోంది. సన్నాలకు పురుగులు ఆశిస్తుండడంతో ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ఖర్చు ఎక్కువవుతోంది. దొడ్డు రకం ఎకరానికి 25 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంటే.. సన్నాలు ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.
Also Raed:అంగన్వాడీ టీచర్లకు అస్వస్థత
కొనుగోలు సెంటర్లలో దొడ్డు రకానికి ఏ గ్రేడ్‌కు రూ. 2203 లభిస్తుండగా సన్నాలను బీ గ్రేడ్‌గా పరిగణిస్తూ రూ. 2183 చెల్లింపులు జరుగుతున్నాయి. పైగా సన్నొడ్లను మిల్లర్లు కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి కూడా చూపడం లేదు. దీంతో రైతులు సన్నొడ్ల సాగును భారీగా తగ్గించారు. కొందరు తమ తిండి అవసరాలకు పండిస్తుంటే.. మిగితా వాళ్లు మొత్తానికే వదిలేశారు.
తిండికి కష్టమే..
తినేందుకు ప్రతి ఒక్కరూ సన్న రకాలనే వాడుతున్నారు. దొడ్డు బియ్యం వాడేవాళ్లు చాలా తక్కువ. సన్న రకాలను రైతులు పండించక పోవడంతో మరింత డిమాండ్ పెరిగి.. బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయి. 2021లో సన్న వడ్లను మరాడించిన రైతు రూ. 3 వేలకు క్వింటాల్ అమ్మితే.. 2022 వచ్చే నాటికి రూ. 4 వేలకు పెరిగిపోయింది. కొన్నిచోట్ల రూ.5 వేల వరకు కూడా అమ్ముతున్నారు. దీంతో పేద, దిగువ మధ్య తరగతి ప్రజల తిండికి ఇబ్బందులు తప్పట్లేదు. ఈ సీజన్లో 11 వేల ఎకరాల్లో సన్న రకాలు సాగు చేయగా. దాదాపు 28 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. వీటిని రైతులు తమ అవసరాలకే ఉపయోగించుకుంచుకునే అవకాశమే ఎక్కువగా కన్పిస్తోంది. దీంతో ఈసారి సన్న బియ్యం రేట్లు ఏ స్థాయికి చేరుకుంటాయో..? అన్న ఆందోళన అప్పుడే మొదలైంది.