బ్యాంకు ఖాతాధారుల పేరుపై లేని భూములను సృష్టించి క్రాప్ లోన్ తో కొందరు లక్షల రూపాయలను కొట్టేసిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. బ్యాంకు అధికారులే డబ్బులను దోచుకుని.. తీసుకున్న అప్పులను తమపై భారంగా మోపుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలో ఓ ప్రముఖ బ్యాంకులో ఇస్లావత్ తండా గ్రామ పంచాయతీకి చెందిన ఇస్లావత్ సాలీ డ్వాక్రా అకౌంట్ తో పాటు సాధారణ ఎకౌంట్ కలిగి ఉంది. ఆమెకు వితంతు పింఛన్ నెలకు బ్యాంకులో డిపాజిట్ అవుతుంది. ఇటీవల అవసర నిమిత్తం డబ్బు విత్ డ్రా కోసం బ్యాంక్ కు వెళ్లిన ఆమెకు ఊహించ షాక్ తగిలింది. మీరు బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నందున మీ డబ్బును హోల్డ్ లో ఉంచామని క్యాషియర్ తెలిపారు. సాలీ కుమారుడు ఇస్లావత్ హుస్సేన్ తో బ్యాంకుకు వచ్చి మాకు అసలు భూమి లేదు.. క్రాప్ లోను ఎక్కడి నుంచి ఇచ్చారని ప్రశ్నించడంతో బ్యాంక్ ఆఫీసర్లు భుజాలు తడుముకున్నారు.
తమ్మకున్నది ఉన్నది 12 కుంటల భూమి అది కూడా మరిపెడ రెవిన్యూ పరిధిలో ఉందని వారు తెలపడంతో అసలు ట్విస్ట్ వేలుగులోకి వచ్చింది. లేని భూమికి 65వేల రూపాయలు క్రాప్ లోన్ ఇచ్చినట్టు అనంతరం 2017సంవత్సరంలో వారిని సంప్రదించకుండానే రెన్యువల్ చేసి వడ్డీతో సహా 89వేలు రూపాయలుగా నమోదు చేశారు. మొత్తం కలిపి ఇప్పటి వరకు 1లక్ష 40వేలు రూపాయలు క్రాప్ లోన్ గా నమోదు చేయబడి ఉంది. దీంతో ఆమెకు డిపాజిట్ అయినా వితంతు పింఛన్ 45వేల రూపాయలు హోల్డ్ లో ఉంచారు. మిగతా లోన్ చెల్లించాలి అనటంతో.. అసలు లేని భూమికి క్రాఫ్ లోన్ ఎలా ఇచ్చారని బాధితురాలు వాపోయారు.
అయితే ఇస్లావత్ తండా గ్రామానికీ చెందిన కొందరు ప్రైవేట్ వ్యక్తులతో బ్యాంక్ అధికారులు చేతులు కలిపి.. సుమారు 100మంది సామాన్య ప్రజల్ని సంతకం చేయించుకొని మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకు ముందు ఆందోళన చేసేందుకు బాధితులందరూ సిద్ధమయ్యారు. మోసం చేసిన బ్యాంక్ అధికారులను వారితో చేతులు కలిపిన ప్రైవేట్ వ్యక్తులను కఠినంగా శిక్షించి మాకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.