
‘ఈ కాలం పిల్లలు బాగా ఫాస్ట్’ అని అంటుంటారు చాలామంది. వాళ్లంత చురుకుగా ఉంటున్నారు మరి. కొందరికి చిన్నప్పటి నుంచి మంచి టాలెంట్ ఉంటుంది. ఇంకొందరికి పెరుగుతున్న కొద్దీ తెలివితేటలు వస్తాయి. పెద్ద వాళ్ల తెలివికి ఏ మాత్రం తీసిపోకుండా, పిల్లలు వాళ్ల తెలివి తేటలతో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఐదేండ్ల ఆత్రేయ ఘోష్ కూడా ఆ కోవకు చెందుతుంది. ఎబిసిడిలు చెప్పి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎక్కింది.
వెస్ట్ బెంగాల్‌లోని మిడ్నాపూర్ ఆత్రేయ ఘోష్‌ది. ఆత్రేయ తండ్రి అనిరుద్ధ పోలీస్ ఆఫీసర్. కూతురు చిన్నప్పటి నుంచి విషయాలను తొందరగా నేర్చుకోవడం, టీవీలో వచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌లను ఒకసారి విని తిరిగి పాడటం చేసేది. అది గమనించిన అనిరుద్ధ దంపతులు అప్పటినుంచి రకరకాల కథలు చెప్పేవాళ్లు. పజిల్స్ సాల్వ్ చేయడం నేర్పిస్తుండే వాళ్లు. ఇలా ఆత్రేయ నాలెడ్జ్‌ను పెంచేవాళ్లు. సాధారణంగా ఐదేండ్ల వయసు పిల్లలకు అక్షరాలను పలకడమే కష్టం. అలాంటిది.. ఆత్రేయ ఏ మాత్రం తడబడకుండా, తప్పులు పోకుండా ఇంగ్లీష్ అక్షరాలను చెప్తోంది. వరుసగా కాకుండా మధ్య మధ్యలో ఒక్కో అక్షరం అడిగినా.. టక్కున సమాధానం ఇస్తుంది. అందులో వింతేముంది అంటున్నారా! ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌ను ఆర్డర్‌లోనే కాదు రివర్స్‌లో కూడా అంటే ‘Z నుంచి A’ వరకు పొల్లుపోకుండా చెప్తోంది.
ఈ ఫీట్‌ను కేవలం 23 సెకన్లలోనే పూర్తి చేసింది. ఈ ఘనత సాధించినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు ఇచ్చారు ఆత్రేయకు.