కొత్త మండలాలపై జగడం.. విలీనాన్ని వ్యతిరేకిస్తున్న పలు గ్రామాల ప్రజలు

కొత్త మండలాలపై జగడం.. విలీనాన్ని వ్యతిరేకిస్తున్న పలు గ్రామాల ప్రజలు
  • శాస్త్రీయత లేదంటూ అసహనం
  • ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయలేదంటూ ఆందోళనలు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే కొత్తగా నాలుగు మండలాలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు గతంలో చాలా రోజుల పాటు కొత్త మండలాల కోసం ఆందోళనలు చేసి ఈ అంశాన్నే మర్చిపోయారు. అయితే ప్రస్తుతం ప్రజల నుంచి పెద్దగా ఒత్తిడి లేకున్నప్పటికీ ప్రభుత్వం అనూహ్యంగా కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. నిర్మల్ జిల్లాలో ఇప్పటికే 19 మండలాలు ఉండగా.. కొత్తగా మరో నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.

మండల కేంద్రాలు దూరమవతున్నాయంటూ..

వారం క్రితం మామడ మండల పరిధిలోని పొనకల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత మూడ్రోజుల క్రితం ముథోల్ నియోజ కవర్గంలోని బెల్​తరోడా, మాలేగావ్ గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. రెండ్రోజుల క్రితమే సారంగాపూర్ మండల పరిధిలోని బీరవెల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సారంగాపూర్, కుభీర్ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తమను కొత్త మండలాల్లో విలీనం చేయవద్దంటూ కోరుతున్నారు. 

ప్రభుత్వం ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు తీసుకోకుండా శాస్త్రీయ లోపంతో విలీన ప్రక్రియ చేపట్టిందంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే కుభీర్ మండలంలోని పల్సి, సునారి, గోడపూర్, గొడ్సెర గ్రామస్తులు ఆందోళనలు మొదలుపెట్టారు. వీరంతా రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సారంగాపూర్ మండలంలోనే తమను కొనసాగించాలంటూ మలక్ చించోలి గ్రామస్తులు కోరుతున్నారు. 

తమ గ్రామం సారంగాపూర్ మండల కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగా.. విలీనం కారణంగా బీరవెల్లి మండల కేంద్రానికి 12 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. మాలేగాం మండలంలో తమ గ్రామాలను విలీనం చేసిన కారణంగా మండల కేంద్రానికి చేరుకోవాలంటే అధిక దూరం వెళ్లాల్సి వస్తుందని కుభీర్ పరిధిలోని పల్సి, సోనారి, గొడిసెరా గ్రామస్తులు వాపోతున్నారు. తమ గ్రామాలను యథావిధిగా పాత మండలాల్లోనే కొనసాగించాలని, లేదంటే విలీన ప్రక్రియను అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.

అభిప్రాయానికి భిన్నంగా..

కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో వివిధ గ్రామాలను విలీనం చేసే విషయంలో సంబంధిత గ్రామ పంచాయతీలు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని ఆయా గ్రామస్తులు మండిపడుతున్నారు. శాస్త్రీయ కోణంతో కాకుండా ఆదరాబాదరాగా కొత్త మండలాలను ఏర్పాటు చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త మండలాల్లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ మరికొన్ని గ్రామాలు సైతం ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. కోర్టులను ఆశ్రయించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు పలు గ్రామస్తులు చెప్తున్నారు.  ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటుపై 15 రోజుల్లోగా అభిప్రాయాలు చెప్పాలంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా.. తాము అసమ్మతి తెలుపుతూ తీర్మానాలు చేస్తామని పేర్కొంటున్నారు.

విలీనాన్ని అడ్డుకుంటాం..

ప్రభుత్వం తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే సారంగాపూర్ మండలం నుంచి తమ గ్రామాన్ని బీరవెల్లి  మండలంలో విలీనం చేసింది. ఈ నిర్ణయం కారణంగా మండల కేంద్రంలో పనుల కోసం  తాము 12 కి.మీ. దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.  ప్రస్తుతం సారంగాపూర్ మండలం కేవలం 3 కి.మీ. దూరంలోనే ఉండగా.. దీన్ని పక్కన పెట్టి బీరవెల్లి మండలంలో విలీనం చేయడం ఏమిటి? విలీన ప్రక్రియను ఉపసంహరించుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం. 

  భోజన్న, సర్పంచ్, మలక్ చించోలి