
- పుట్టుకొచ్చిన కంటెంట్ క్రియేటర్ ఎకానమీ
- ఆన్‌లైన్ యాడ్స్‌పై కంపెనీల ఫోకస్
- పెరుగుతున్న ఈ–కామర్స్ సేల్స్
- సినిమా ఇండస్ట్రీకి ఓటీటీతో భారీ బూస్ట్
న్యూఢిల్లీ: మెట్రో రైళ్లలోనో, బస్సుల్లోనో ప్రయాణిస్తున్నప్పుడు లేదా రెస్టారెంట్‌లో తింటున్నప్పుడు..ఎక్కడ చూసినా జనాలు ఫోన్లు పట్టుకొని కనిపిస్తుంటారు. కిందటేడాది ఇండియాలోని మొత్తం యూజర్లు కలిసి లక్ష కోట్ల గంటల పాటు స్మార్ట్‌ఫోన్లు చూస్తూ గడిపారని ఓ సర్వే వెల్లడించింది. ఇందులో కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనే ఎక్కువ టైమ్ వేస్ట్ చేశారు.
దీంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు , వ్యాపారాలు భారీగా సంపాదిస్తున్నాయి. వైరల్ వీడియోలు, ఆస్కార్ విజేతలను చూడటం నుంచి అంతర్జాతీయ పర్యటనలను బుక్ చేయడం వరకు యూజర్లు తమ స్క్రీన్‌లకు అతుక్కుపోవడం పెరిగింది. ఇంటర్నెట్ డేటా వాడకం విపరీతంగా పెరగడంతో టెలికం కంపెనీలకు ఇండియా బంగారు గనిలా మారింది.
కంటెంట్ క్రియేటర్లకు వరం
భారతీయులు స్మార్ట్‌ఫోన్‌లలో బిజీగా ఉంటూ, లక్షలాది కంటెంట్ క్రియేటర్లను పోషిస్తున్నారు. పళ్లు తోముకోవడం నుంచి ఆఫ్రికన్ అడవుల్లో సాహస యాత్రలు చేయడం వరకు వివిధ షార్ట్ వీడియోలను చూస్తున్నారు. ఫలితంగా చాలామంది కంటెంట్ క్రియేటర్లు ఇటువంటి వీడియోలు లేదా వ్లాగ్‌లను సృష్టించి డబ్బు సంపాదిస్తున్నారు. సులభమైన, చౌకైన ఇంటర్నెట్ అందుబాటులో ఉండడంతో ప్రతీ ఒక్కరు ఈ షార్ట్‌వీడియోలను చూడగలుగుతున్నారు. దీంతో ఇండియాలో కంటెంట్ క్రియేటర్ ఎకానమీ పుట్టుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఒక భారీ పరిశ్రమగా మారింది.
వీరు కార్పొరేట్ మార్కెటింగ్ వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో, భారతీయులు స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోతుండడంతో , కంపెనీలు ఆన్‌లైన్ యాడ్స్ బాట పడుతున్నాయి. కేవలం ఆన్‌లైన్ రిటైలర్లే కాకుండా పెద్ద వ్యాపారాలు, చలనచిత్ర నిర్మాతలు, రాజకీయ పార్టీలు కూడా ఆన్‌లైన్‌లో యాడ్స్ పెంచుతున్నాయి. సోషల్ మీడియా ప్రకటన క్యాంపెయిన్‌లపై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఏఐ సాయంతో యూజర్లకు ఏం నచ్చుతాయో, ఏం నచ్చవో ట్రాక్ చేస్తున్నాయి. బ్రాండ్‌లు కేవలం ఉత్పత్తులను మాత్రమే అమ్మడం లేదు. షార్ట్ వీడియోలు, లైవ్ స్ట్రీమ్‌లు, ఇంటరాక్టివ్ ప్రకటనల ద్వారా స్టోరీలను చెప్పి, వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
1.1 లక్షల కోట్ల గంటలు గడిపారు
ఈవై డేటా ప్రకారం, 2024లో భారతీయులు స్మార్ట్‌ఫోన్లను చూస్తూ మొత్తం 1.1 లక్షల కోట్ల గంటలు గడిపారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వరకు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో గంటల కొద్దీ టైమ్ వేస్ట్ చేశారు. ఇండియాలో ఫోన్ యూజర్లు సగటున రోజుకి ఐదు గంటల పాటు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. దీనిలో దాదాపు 70 శాతం టైమ్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో, గేమింగ్, వీడియోల కోసం కేటాయించారు. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగడంతో ఓటీటీల వాడకం కూడా ఎక్కువైంది. రూ.2.5 లక్షల కోట్ల ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి ఓటీటీ పెద్ద దన్నుగా మారింది.