తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దీర్ఘకాలిక ప్రణాళికలతో అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2024, ఆగస్ట్ 20వ తేదీ హైదరాబాద్ సిటీ మాదాపూర్ HICCలో క్రెడాయ్ తెలంగాణ స్టేట్ కాన్ 2024 ప్రారంభంలో మంత్రులు పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రెడాయ్ సభ్యులు కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం అభినందించదగ్గ విషయంగా అభివర్ణించారు మంత్రులు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని వెల్లడించారు. క్రెడాయ్ కు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు నెలల్లో రేడియల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని.. లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు మంత్రులు. బిల్డర్ల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ ప్రేమ్ సాయిరెడ్డి మాట్లాడుతూ నిర్మాణ రంగంలోని నిపుణులు ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నారని.. వాటిని బిల్డర్లు అనుసరించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ నీ ఉపయోగించుకుని బిల్డర్లు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం భూముల ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకుందని.. అదే విధంగా రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారాయన.
ఈ కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ మురళి కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పాండు రంగారెడ్డి, క్రెడాయ్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిల్డర్లు పాల్గొన్నారు.