ఇండియాలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. వ్యక్తిగతంగా వినియోగదారులు ఖర్చు చేసే శక్తి రెట్టింపు అయ్యింది. ఈ ఖర్చుల్లో దాదాపు అప్పు చేసి కొన్నవో లేదా ఈఎంఐ, క్రెడెట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసినవే ఎక్కవగా ఉంటాయి. అంటే అప్పు చేసి పప్పు కూడు తిన్నవే అన్నట్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం 2024 మార్చి నాటికి క్రెడిట్ కార్డుల లావాదేవీలు రూ.18 లక్షల కోట్లు పెరిగాయి. గడిచిన మూడేళ్లలో క్రెడిట్ కార్డుల లావాదేవీల విలువ మూడు రెట్లు పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది.
క్రెడిట్ ద్వారా పెరిగిన కొనుగోళ్లు
కస్టమర్ ఏదైనా వస్తువులు కొనాలంటే క్రెడిట్ కార్డు ద్వారా కొంటే బ్యాంక్ లు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అందుకే క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతుంది. క్రెడిట్ కార్డ్ లావాదేవీల విలువ గత మూడేళ్లలో మూడు రెట్లు పెరిగి రూ.6.30 లక్షల కోట్ల నుంచి రూ.18.31 లక్షల కోట్లకు చేరుకుంది. క్రెడిట్ కార్డ్ లావాదేవీల విలువ 2022 మార్చిలో రూ. 6.30 లక్షల కోట్ల నుండి రూ. 9.71 లక్షల కోట్లకు, మార్చి 2023 మార్చి నాటికి రూ.14.32 లక్షల కోట్లకు పెరిగింది. FY24లో రూ.18.31 లక్షల కోట్లు క్రెడిట్ కార్డ్ లావాదేవీలలో వ్యాపారులు మరియు దుకాణాలకు సంబంధించిన POS లావాదేవీల ద్వారా రూ. 6.51 లక్షల కోట్లు జరిగాయి.
ఇండియాలో ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి?
కార్డ్ వినియోగదారుల ద్వారా నెలవారీ ఖర్చులు ఇప్పుడు భారీగా పెరిగాయి. 2023 మార్చిలో 8.53 కోట్లు, 2022 మార్చిలో 7.36 కోట్లు, 2021 మార్చిలో 6.20 కోట్లుగా వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డుల సంఖ్య 2024 మార్చి నాటికి శరవేగంగా 10.18 కోట్లకు చేరింది. అయితే క్రెడిట్ కార్డ్ బకాయిలు 2022లో రూ.లక్షా 61వేల 512 కోట్లు ఉంటే ప్రస్తుతం 2024 మే నాటికి రూ. 2లక్షల 67వేల 979 కోట్లకు పెరిగాయి. అంతా అప్పుల కుప్పే మరి. ఈ కామర్స్ సంస్థలు, కరోనా తర్వాత మారిపోయిన లైఫ్ స్టైల్ ఏ ఈ మార్పుకు కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.