- మంచినీరు, టాయిలెట్లు లేక ఇబ్బందులు
- కొన్ని గ్రేవ్ యార్డుల్లో నో స్పేస్ బోర్డులు
- కొన్నింటిపైనే అధికారుల దృష్టి
- మిగతా వాటినీ అభివృద్ధి చేయాలని సిటిజన్ల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లోని శ్మశాన వాటికల్లో కనీస సౌలతులు కనిపించడం లేదు. మంచినీరు, టాయిలెట్లు అందుబాటులో లేక అక్కడకు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. మోడల్ గ్రేవ్ యార్డులంటూ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వం కొన్నిచోట్ల అద్భుతంగా నిర్మించి సకల సౌకర్యాలు కల్పించినప్పటికీ.. ఏండ్లుగా కొనసాగుతున్న పలు శ్మశాన వాటికలను మాత్రం మర్చిపోతోంది. పేరున్న వాటిపైనే అధికారులు దృష్టి పెడుతుండటంతో అనేక గ్రేవ్ యార్డులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. గ్రేటర్లో దాదాపు వెయ్యి శ్మశాన వాటికలు ఉండగా చాలా వాటిలో అనేక సమస్యలు ఉన్నాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన వారి దాహాన్ని తీర్చేందుకు మంచినీరు కూడా ఉండటం లేదు. కొన్ని శ్మశాన వాటికలకు డెడ్‌బాడీలు ఎక్కువగా వస్తున్నప్పటికీ బర్నింగ్ పాయింట్లను పెంచడం లేదు. రెండు, మూడు బర్నింగ్ పాయింట్లు మాత్రమే ఉండటంతో అంత్యక్రియలు జరిపేందుకు అవకాశం లేక వేరే చోటకు తీసుకెళ్తున్నారు.
మెయింటెనెన్స్‌లో నిర్లక్ష్యం..
చనిపోయిన వ్యక్తుల అంత్యక్రియలు జరిపేందుకు ఒక్కో శ్మశాన వాటికకు డైలీ వందలాది మంది కుటుంబసభ్యులు, బంధువులు వస్తుంటారు. ఒకచోట బోర్లు లేకపోవడం, మరో చోట వాటర్ సరఫరా ఉన్నా మెయింటెనెన్స్ లోపంతో నల్లాలు పనిచేయడం లేదు. ఇంకొన్ని చోట్ల బోర్లు అవసరమని గుర్తించినా అధికారులు అందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ సమస్యలపై సోషల్ మీడియాలో ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. లాలాపేటలోని శ్మశాన వాటికలో నీటి సరఫరా కావడంలేదని, అక్కడకు వస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు పట్టించుకోవాలంటూ నేతికార్ మహేశ్ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. సైదాబాద్ లోని శ్మశానవాటిక అపరిశుభ్రంగా ఉందని, క్లీన్ చేయండంటూ ముస్తాక్ అనే సిటిజన్ ట్విట్టర్లో కంప్లయింట్చేశాడు. ఇలా వివిధ ప్రాంతాల నుంచి అధికారులకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కొన్నిచోట్ల అంత్యక్రియలు జరిపేందుకు ఖాళీగా లేకపోవడంతో వేరే చోటకు వెళ్లాల్సి వస్తోందని అక్కడి జనం చెబుతున్నారు.
స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చి..
కోటికిపైగా జనాభా ఉన్న గ్రేటర్ సిటీలో అన్ని కమ్యూనిటీలకు సంబంధించి వెయ్యి లోపు మాత్రమే గ్రేవ్ యార్డులున్నాయి. హిందువుల దహన సంస్కారాలు ఒకచోట కాకపోయినా మరోచోటకు తీసుకెళ్లి నిర్వహిస్తున్నప్పటికీ.. మైనార్టీలకు సంబంధించి అంత్యక్రియలు జరిపేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే కొన్ని శ్మశానవాటికల్లో నో స్పేస్ అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. గ్రేవ్ యార్డుల కోసం స్థలం కేటాయిస్తామని ఎన్నికల సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు హామీలు ఇస్తున్నప్పటికీ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు. మనిషి చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు కూడా ఇబ్బందులు తప్పడం లేదని సిటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బర్నింగ్ పాయింట్లు పెంచాలె..
మూసీ నది వద్ద మరిన్ని మౌలిక వసతులు కల్పించాలి. సిటీ నుంచి కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చనిపోయిన వారి అస్తికలను తీసుకువచ్చి లంగర్ హౌస్ లోని త్రివేణి సంగమంలో వదులుతారు. ఇలాంటి చరిత్ర కలిగిన త్రివేణి సంగమంలో సరైన వసతులు లేక అక్కడికి వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నరు. శ్మశాన వాటికల్లో స్నాన ఘట్టాలు, వీధి లైట్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలి. దహన సంస్కారాలు చేసేందుకు మూడు బర్నింగ్ పాయింట్లు ఉన్నాయి. మరో మూడు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
–లక్ష్మణ్, లంగర్ హౌస్
ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లే..
జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. నీరు లేకపోవడంతో కొన్ని సమయాల్లో ట్యాంకర్లను తీసుకొస్తున్నం. టాయిలెట్లు సరిపడా లేవు. అస్తికలు పెట్టేందుకు రూమ్ కూడా లేదు. ప్రస్తుతం ఇక్కడ 5 బర్నింగ్ పాయింట్లు ఉన్నాయి. మరికొన్ని ఏర్పాటు చేయా ల్సిన అవసరం ఉంది. వెయిటింగ్ హాల్ కూడా నిర్మించాలి. మోడల్ గ్రేవ్ యార్డుల తరహాలో తీర్చిదిద్దాలి.
– సత్యనారాయణ, శ్మశాన వాటిక కాపరి, లాలాపేట