Women's T20 World Cup 2024: కెప్టెన్‌గా స్టార్క్ సతీమణి.. ఆస్ట్రేలియా ప్ర‌పంచ‌క‌ప్‌ జ‌ట్టు ప్ర‌క‌టన

అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్న మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కొరకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ సతీమణి అలిస్సా హీలీ నాయకత్వంలో 15 మంది సభ్యులతో బలమైన జట్టును ఎంపిక చేసింది. వైస్‌ కెప్టెన్‌గా తహిల మెక్‌గ్రాత్‌ సేవలు అందించనుంది. సీనియర్‌ స్పిన్నర్‌ జెస్‌ జొనాస్సెన్‌ను పక్కన పెట్టిన సెలెక్టర్లు.. పేస్‌ బౌలర్‌ తైలా వ్లేమింక్‌కు జట్టులో చోటు కల్పించారు. 

డిఫెండింగ్ ఛాంపియ‌న్‌, ఆరు సార్లు ప్రపంచకప్ విజేత అయిన ఆసీస్ పూర్తి స్థాయి జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగ‌నుంది. మెగ్ లానింగ్, అలిస్సా హీలీ, గార్డ్‌నర్‌, కిమ్‌ గార్త్‌, గ్రేస్‌ హ్యారిస్‌, త‌హ్లియా మెక్‌గ్రాత్‌ రూపంలో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. ఈసారి మరో టైటిల్ అందుకొని వ‌రుస‌గా నాలుగు సార్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ సాధించిన తొలి జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించాల‌ని ఆరాట‌ప‌డుతోంది.

టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు:

అలిస్సా హీలీ (కెప్టెన్‌), త‌హ్లియా మెక్‌గ్రాత్‌ (వైస్‌ కెప్టెన్‌), డార్సీ బ్రౌన్‌, యాష్‌ గార్డ్‌నర్‌, కిమ్‌ గార్త్‌, గ్రేస్‌ హ్యారిస్‌, అలానా కింగ్‌, ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, సోఫీ మోలినెక్స్‌, బెత్‌ మూనీ, ఎల్లిస్‌ పెర్రీ, మేగాన్ షట్, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, జార్జియా వేర్హమ్‌, టైలా వ్లామిన్‌.

10 జట్లు.. యూఏఈ వేదిక

అక్టోబర్‌ 3 నుంచి 20 వ‌ర‌కు మహిళల టీ20 ప్రపంచకప్ యూఏఈ వేదికగా జ‌ర‌గ‌నుంది. వాస్తవానికి ఈ టోర్నీ బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సి ఉండగా.. రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఎడారి గడ్డకు తరలించారు. మొత్తం 10 జట్లు ట్రోఫీ కోసం పోటీప‌డ‌నున్నాయి. ఈ 10 జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు. భారత్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్‌, పాకిస్తాన్ లు గ్రూప్‌-ఏలో ఉండగా.. బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, స్కాట్లాండ్ జ‌ట్లు గ్రూప్‌-బిలో ఉన్నాయి.