బెట్టింగ్ కేరాఫ్ ఓరుగల్లు .. గ్రేటర్ వరంగల్ లో ఏటా జోరుగా క్రికెట్ బెట్టింగ్

బెట్టింగ్ కేరాఫ్ ఓరుగల్లు .. గ్రేటర్ వరంగల్ లో ఏటా జోరుగా క్రికెట్ బెట్టింగ్
  • బుకీల అవతారమెత్తి జనాలను ముంచుతున్న కేటుగాళ్లు
  • ఆస్తులు పోగొట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న బాధితులు
  • అరెస్టులతో చేతులు దులిపేసుకుంటున్న పోలీసులు

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరం క్రికెట్​ బెట్టింగ్​ దందాకు అడ్డాగా మారుతోంది. ఏటా ఐపీఎల్ సీజన్​ స్టార్ట్​ అయ్యిందంటే గ్రేటర్​ సిటీకి చెందిన కొందరు బుకీల అవతారమెత్తి బెట్టింగ్ నిర్వహిస్తుండగా, వారి వలలో పడి ఎంతోమంది యువకులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడుతుంటే, ఇంకొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి బుకీల దందాకు చెక్​ పెట్టాల్సిన పోలీసులు అరెస్టులతో చేతులు దులిపేసుకుంటుండగా, జైలుకు వెళ్లొచ్చిన బెట్టింగ్ రాయుళ్లు ఏటా అదే దందా సాగిస్తున్నారు. 

ఇలా తరచూ బెట్టింగ్​లు నిర్వహించేవారిపై పీడీ యాక్టులు పెట్టాల్సిన పోలీసులు లైట్​తీసుకుంటుండడంతో నగరంలో బెట్టింగ్ దందాకు ఫుల్​స్టాప్​ పడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో బెట్టింగ్​ యాప్స్ ​ప్రమోషన్స్ ​వ్యవహారం కాక రేపుతుండగా, సిటీలోని క్రికెట్ బుకీలపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఏటా రూ.కోట్లతో దందా..

వరంగల్ నగరంలో ఈజీ మనీకి అలవాటు పడిన కొంతమంది ఐపీఎల్​ సీజన్​ వచ్చిందంటే బెట్టింగులపైనే ఆధారపడుతున్నారు. ప్లే స్టోర్లలో లభించే యాప్స్ డౌన్​ లోడ్​ చేసుకుని బెట్టింగులు కాస్తున్నారు. ఇలాంటి యాప్స్​ డౌన్​ లోడ్​ చేసుకునే వారిని లోకల్​ గా బుకీలుగా మారిన వ్యక్తులు లీడ్ చేస్తున్నారు. యాప్​ డౌన్​ లోడ్​ చేసుకున్న తర్వాత వారికి ప్రత్యేకంగా యూజర్​ నేమ్, పాస్​ వర్డ్​ ఇచ్చి లాగిన్​ చేయించుకుని, ప్రతి మ్యాచ్​ స్టార్టింగ్​కు ముందు ఓ వాట్సాప్​ గ్రూప్​ పెట్టి బెట్టింగ్​లు నిర్వహిస్తున్నారు. బాల్​ టు బాల్, ఓవర్​ టు ఓవర్ బెట్టింగ్​పెడుతున్నారు. తక్కువ మొత్తంలో బెట్​పెట్టినప్పుడు గెలిపించి, ఎక్కువ మొత్తంలో పెట్టినప్పుడు ఓడగొడుతూ గోల్​మాల్​ చేస్తున్నారు. ఇలా ప్రతి ఐపీఎల్​ సీజన్​లో రూ.కోట్లలో దందా సాగిస్తుండగా, వారి బారిన పడి ఎంతో మంది నష్టపోతున్నారు. 

రోడ్డున పడుతున్న కుటుంబాలు..

బెట్టింగ్​ బాగోతం వల్ల కొంతమంది అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరికొంతమంది అప్పులు తీర్చేందుకు చోరీల బాట పడుతున్నారు. మూడేండ్ల కిందట ధర్మసాగర్​ మండలం మల్లక్​పెల్లికి చెందిన రామకృష్ణారెడ్డి బెట్టింగుల్లో రూ.6లక్షల వరకు లాస్​ అయి ప్రాణాలు తీసుకున్నాడు. 2023 నవంబర్​లో నర్సంపేటకు చెందిన ప్రశాంత్​ రూ.2 లక్షల అప్పులు చేసి, చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జులైలో రఘునాథపల్లికి చెందిన రైల్వే ఉద్యోగి రాజు కూడా ఇలాగే ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

 ఇలా కొంతమంది అప్పుల భారంతో సూసైడ్​ చేసుకుంటుంటే, మరికొందరు దొంగలుగా మారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. రాయపర్తికి చెందిన ధర్మరాజు క్రికెట్​ బెట్టింగ్​లో లాస్​ అయి 17 చోరీలు చేయగా, పోలీసులు అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు. దాదాపు రెండేండ్ల కిందట వరంగల్​ సిటీ బొక్కలగడ్డ, కాకతీయ కాలనీకి చెందిన ఏడుగురు యువకులు బెట్టింగుల్లో లాస్​అయి దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కారు. మహబూబాబాద్​ జిల్లాకు చెందిన సునీల్​ కూడా ఇలాగే చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. 

రెండు రాష్ట్రాల బుకీ.., ఐదుసార్లు అరెస్ట్

హనుమకొండ గోపాలపూర్​ వెంకటేశ్వరకాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ 2016 నుంచి బెట్టింగ్ మొదలుపెట్టాడు. ముంబైకి చెందిన కొంతమందిని పరిచయం చేసుకుని రెండు రాష్ట్రాల బుకీగా మారాడు. 2019లో మొదటిసారి హైదరాబాద్​ కమిషనరేట్ పరిధిలో చందానగర్​ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ అదే దందా చేస్తూ సైబరాబాద్​ కమిషనరేట్ పరిధి రామచంద్రాపూర్​ పోలీసులకు చిక్కాడు. అనంతరం వరంగల్ కు మకాం మార్చి ఐపీఎల్ సీజన్​లో కోట్లలో లావాదేవీలు నడిపిస్తుండగా, ఆయన చేతుల్లో మోసపోయిన ముగ్గురు బాధితులు కేయూ, హనుమకొండ పీఎస్​లలో ఫిర్యాదు చేశారు. 2021 నవంబర్​లో వరంగల్ టాస్క్​ ఫోర్స్​పోలీసులు పట్టుకున్నారు.

 ఆ సమయంలో ప్రసాద్​వద్ద  రూ.2.05 కోట్ల నగదు, బ్యాంక్​అకౌంట్​లో మరో రూ.70 లక్షలు లభ్యం కావడంతో అతడి దందా ఏపాటిదో పోలీసులకు కూడా అర్థమైంది. ఆ తర్వాత జైలుకు వెళ్లి వచ్చిన ఆయన మళ్లీ అదే బాటలో నడిచాడు. 2022 జూన్​లో రూ.20 లక్షలతో, 2024 ఆగస్టులో మళ్లీ రూ.32 లక్షలతో కేయూ పోలీసులకు పట్టుబడ్డాడు. మొత్తంగా మూడు కమిషనరేట్ల పరిధిలో ఐదు సార్లకుపైగా పోలీసులకు చిక్కగా, మరికొంతమంది కూడా ఇలాగే దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఏటా బెట్టింగ్​లు నిర్వహిస్తున్నా పీడీ యాక్టుల్లాంటి చర్యలు చేపట్టకపోవడం వల్లే వారి దందా మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుగా కొనసాగుతోందనే టాక్​ నడుస్తోంది.

ఎన్నిసార్లు చిక్కినా నో ఛేంజ్..

బెట్టింగ్ కు అలవాటుపడిన కొంతమంది ఆ దందాను విడిచిపెట్టడం లేదు. ఏటా ఐపీఎల్​ సీజన్​ వచ్చిందంటే బెట్టింగులకు రెడీ అయిపోతున్నారు. పోలీసులు అరెస్ట్​ చేసినా జైలుకు వెళ్లి బయటకు రావడం, మళ్లీ అదే దందా చేయడం కామనైపోయింది. కమిషనరేట్​లో గతంలో వివిధ క్రికెట్​ టోర్నీల్లో బుకీలుగా వ్యవహరించిన కొంతమంది మళ్లీ అదే దందా సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఏదైనా కేసులో రెండు, మూడుసార్లు పట్టుబడితే పీడీ యాక్టులు పెడుతామని చెప్పే పోలీసులు, దానిని మాటలకే పరిమితం చేస్తుండటం వల్లే బెట్టింగ్​ రాయుళ్లు, బుకీలకు చెక్​ పడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఇలాంటి బెట్టింగ్​బుకీల ఆగడాలకు చెక్​పెట్టి, అమాయకుల జీవితాలు రోడ్డున పడకుండా చూడాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.