వరంగల్​లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

వరంగల్​లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
  • రూ.1.58 లక్షల నగదు, 4 ఫోన్లు స్వాధీనం

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.58 లక్షల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బోరబండ ఏరియాకు చెందిన చింతపండు కృష్ణ, హనుమకొండలోని పద్మాక్షి కాలనీకి చెందిన మేడిశెట్టి నరేశ్, వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన పులి ఓంకార్, వరంగల్ పైడిపల్లికి చెందిన పల్లపు సురేశ్, హనుమకొండ కుమ్మరివాడకు చెందిన కేతిరి రంజిత్, ఏపీలోని కాకినాడకు చెందిన పండు గ్యాంగ్​గా ఏర్పడ్డారు.

ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన ఓ యాప్ ద్వారా వీళ్లంతా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి హనుమకొండ పద్మాక్షికాలనీలోని మేడిశెట్టి నరేశ్ ఇంటి వద్ద బెట్టింగ్ నిర్వహిస్తుండగా తనిఖీలు చేపట్టారు. కృష్ణ, నరేశ్, పులి ఓంకార్ ను పట్టుకున్నారు. సురేశ్, రంజిత్, పండు పరారీలో ఉన్నారు. బెట్టింగ్ కు పాల్పడుతున్న వీరిని విచారణ కోసం హనుమకొండ పోలీసులకు అప్పగించారు. ముఠాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సీఐ ఎం.రంజిత్ కుమార్, ఎస్సై వి.దిలీప్, సిబ్బందిని ఏసీపీ ఏ.మధుసూదన్  అభినందించారు.