హోటళ్లలో క్రికెట్ బెట్టింగ్ .. ఇద్దరు అరెస్ట్

శంషాబాద్, వెలుగు: హోటళ్లలో రూమ్​లు తీసుకుని క్రికెట్ మ్యాచ్​లపై ఆన్ లైన్ బెట్టింగ్​లకు పాల్పడుతున్న ఇద్దరిని శంషాబాద్ జోన్ ఎస్​వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం డీసీపీ నారాయణ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఏపీలోని భీమవరానికి చెందిన సురేశ్, జగదీశ్(32) ఇద్దరూ సిటీలో ఉంటూ ఐపీఎల్ మ్యాచ్​లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.  శంషాబాద్​లోని మధురానగర్​లో ఉన్న డీఎస్ఆర్ హోటల్​లో రూమ్ రెంట్​కు తీసుకున్నారు.మంగళవారం రాత్రి జరిగిన సన్​రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్​పై బెట్టింగ్ నిర్వహించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హోటల్​పై దాడులు చేశారు. సబ్ బుకీ జగదీశ్​ను అదుపులోకి తీసుకున్నారు. రూ.24 లక్షల క్యాష్, 5 సెల్ ఫోన్లు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అకౌంట్ లోని రూ.4 లక్షలను ఫ్రీజ్ చేశారు. మెయిన్ బుకీ సురేశ్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా శంషాబాద్ ఎయిర్​పోర్టు పరిధిలోని  ఫార్చ్యూన్ బ్లిస్ హోటల్​లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా ఎస్​వోటీ పోలీసులు దాడులు చేశారు. ఏపీకి చెందిన సబ్ బుకీ కృపానందంను అదుపులోకి తీసుకున్నారు. రూ.3 లక్షల క్యాష్, 15 సెల్​ఫోన్లు, ఒక లైన్ బోర్డు, ల్యాప్ టాప్​ను స్వాధీనం చేసుకున్నారు. మెయిన్ బుకీ చైతన్య రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.