T20 World Cup 2024: ఆసీస్‌పై ప్రతీకార విజయం.. ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో భారీ సంబరాలు

T20 World Cup 2024: ఆసీస్‌పై ప్రతీకార విజయం.. ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో భారీ సంబరాలు

టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. కింగ్‌స్టౌన్ లోని సెయింట్ విన్సెంట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శనివారం (జూన్ 23) ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో గెలిచి కంగారూల జట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది. సంచలనాలు సృష్టించడంలో ముందు వరుసలో ఉండే ఆఫ్గన్ జట్టుకు ఇది పెద్ద విషయం కాదు. అయితే ఈ విజయానికి ఒక స్పెషాలిటీ ఉంది. ప్రతీకారం ఉంది. 2023 లో భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచే మ్యాచ్ లో ఓడింది. మ్యాక్స్ వెల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి ఆఫ్ఘన్లకు పీడకలనే మిగిల్చాడు. 

292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లను కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ దశలో మ్యాక్స్ వెల్ అద్భుతం చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సహకారంతో ఒంటి చేత్తో ఆసీస్ కు విజయాన్ని అందించాడు. ఈ పరాజయాన్ని మర్చిపోవడానికి ఆఫ్ఘనిస్తాన్ కు చాలా కాలమే పట్టింది. అయితే కంగారూల జట్టుపై టీ20 వరల్డ్ కప్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. ఆసీస్ లాంటి అగ్ర శ్రేణి జట్టుపై గెలవడం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ సమిష్టిగా ఆడి ఒక ప్రణాళికతో ఆసీస్ ను మట్టి కురిపించింది. 

ఆఫ్ఘనిస్తాన్ విజయంతో ఆటగాళ్లతో పాటు స్టేడియంలో అభిమానులు సంబరాలు హైలెట్ గా నిలిచాయి. ఇక ఆ దేశంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అభిమానులు వీధుల్లో తిరుగుతూ హంగామా చేశారు. స్ట్రీట్ లో పెద్ద స్క్రీన్ పెట్టి మ్యాచ్ చూసిన అభిమానులు మ్యాచ్ గెలవడంతో వీరి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బాంబ్ లు పేలుస్తూ రోడ్లపై రచ్చ చేశారు.  క్రికెట్ ను విపరీతంగా ఆరాధించే ఆఫ్ఘనిస్తాన్ కు ఇది అతి పెద్ద  విజయం. ఆస్ట్రేలియాపై విజయం సాధించడం ఇదే తొలిసారి. 

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అఫ్గానిస్థాన్‌  జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌ జట్టు  148 పరుగులు చేసింది.  ఓపెనర్లు గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్‌ (51) హాఫ్ సెంచరీలు సాధించారు.149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ను అఫ్గాన్‌ బౌలర్ల ధాటికి 127 పరుగులకే ఆలౌట్ చేశారు.  

మ్యాక్స్‌వెల్ (59) రాణించినా మిగితా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు.  గుల్బాదిన్ నైబ్ (4/20) అద్భుత బౌలింగ్‌తో అఫ్గాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో గ్రూప్‌-1లో భారత్‌ రెండు విజయాలు సాధించి సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా.. ఆసీస్, అఫ్గాన్‌ ఒక్కో గెలుపుతో రేసులో నిలిచాయి.