షేన్ వార్న్ మృతిపై క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి

ప్రపంచ క్రికెట్‌లో లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం.. క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 52 ఏళ్ల వార్న్.. స్పృహ తప్పిన పరిస్థితిలో ఆస్పత్రికి తరలించారు.  అక్కడ వైద్యులు ఎంత ప్రయత్నించినా వార్న్ కళ్లు తెరవలేదు. వార్న్ మృతిపై పలువురు ప్రముఖులు స్పందించారు. ‘‘నేను లెగ్‌స్పిన్ నేర్చుకుంది వార్న్ స్ఫూర్తితోనే. ఈ మెసేజ్ టైప్ చేసేటప్పుడు నా చేతులు వణుకుతున్నాయి’’ అని టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ట్వీట్ చేశాడు.

వార్న్ బంతితో వికెట్ తీసినప్పుడల్లా.. క్రికెట్ ఆట మరో టర్న్ తీసుకునేదని వసీం జాఫర్ అన్నాడు. వీళ్లేకాదు సచిన్, గౌతమ్ గంభీర్, వసీం అక్రమ్, అజిత్ అగార్కర్, షోయబ్ అక్తర్, రోహిత్ శర్మ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, వివియన్ రిచర్డ్స్, మయాంక్ అగర్వాల్ సహా పలువురు ప్రముఖ క్రికెటర్లు వార్న్ మృతికి సంతాపం తెలిపారు.

వియ్ మిస్ యూ: సచిన్ 

‘వార్న్ మీ మరణ వార్త మమ్మల్ని షాక్ కు గురిచేసింది. మేం మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం. నీ చుట్టు పక్కల ఎప్పుడూ నిరుత్సాహం దరి చేరనీయలేదు. ఆన్ ఫీల్డ్ , ఆఫ్ ఫీల్డ్ అయినా మీతో గడిపిన క్షణాలను ఎప్పుడూ మర్చిపోలేను.  భారతదేశంపై మీరు ఎంతో ప్రేమ చూపించారు.  అందుకే మీరు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటారు ‘ అని సచిన్ సోషల్ మీడియా వేదికగా వార్న్ కు నివాళి అర్పించారు.

వార్న్ అసలైన ఛాంపియన్‌: రోహిత్‌ శర్మ

వార్న్‌ మృతిని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.. ‘ వార్న్‌ మరణ వార్త విని మాటలు రావడం లేదు. ఇది చాలా విచారకరం. సమకాలీన క్రికెట్‌లో దిగ్గజం, అసలైన ఛాంపియన్‌ అయిన వార్న్‌ ఇప్పుడు మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడు. RIP షేన్ వార్న్.. ఇప్పటికీ నీ మరణ వార్తను నమ్మలేకపోతున్నాను. వార్న్‌ ముగ్గురు పిల్లలకి, అతడి కుటుంబానికి సానుభూతి ’ అని ట్విట్టర్‌ లో సంతాపం ప్రకటించాడు హిట్‌మ్యాన్‌.