
న్యూఢిల్లీ: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ (2028)లో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు కసరత్తు మొదలైంది. ఇందులో ఆరు జట్లు పాల్గొంటాయని ఐవోసీ తాజాగా నిర్ణయించింది. ఒలింపిక్స్ ఆతిథ్య దేశమైన అమెరికాకు డైరెక్ట్ ఎంట్రీ దక్కే అవకాశం ఉంది. మెన్స్, విమెన్స్‌లో ఆరేసి జట్లతో టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. క్వాలిఫికేషన్ ప్రక్రియను ఇంకా నిర్ధారించలేదు. ప్రతి జట్టులో 15 మంది ప్లేయర్లు ఉంటారు. ప్రస్తుతం ఐసీసీలో ఇండియా, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వేతో కలిపి 12 పూర్తి స్థాయి సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 94 అసోసియేట్ దేశాలు మెంబర్స్ గ్రూప్‌లో ఉన్నాయి.
అమెరికా మినహా.. ఒక నిర్దిష్ట కటాఫ్ తేదీలోపు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్–5లో ఉండే జట్లను ఒలింపిక్స్‌కు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్‌గా 128 ఏళ్ల తర్వాత మెగా క్రీడల్లో క్రికెట్ రీ ఎంట్రీకి మార్గమైతే సుగమమైంది. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో చివరిసారి బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య రెండు రోజుల మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం దాన్ని అనధికారిక టెస్ట్‌గా గుర్తించారు. లాస్ ఏంజిల్స్ గేమ్స్‌లో క్రికెట్‌తో పాటు బేస్‌బాల్ / సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్సర్లు), స్క్వాష్ కూడా ఉన్నాయి. వీటిన్నింటికి కలిపి 28 పతకాలను కేటాయించారు. దీంతో మొత్తం 351 మెడల్స్ ఈవెంట్‌కు ఐవోసీ ఆమోదముద్ర వేసింది. అథ్లెట్ల సంఖ్య 10,500గా ఉంది. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి మెన్స్, విమెన్స్ జట్లను సమాన సంఖ్యలో అనుమతిస్తున్నారు. మెన్స్ బాక్సింగ్ మాదిరిగానే విమెన్స్‌లోనూ ఏడు కేటగిరీలకు చాన్స్ ఇచ్చారు.