చైనాలో క్రికెట్: 12 వేల మందికే ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే అవకాశం!

చైనాలో క్రికెట్: 12 వేల మందికే ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే అవకాశం!

ఏషియన్ గేమ్స్ 2023లో భాగంగా చైనా గడ్డపై క్రికెట్ మ్యాచులు జరగనున్న సంగతి తెలిసిందే. ఇది వినడానికి బాగానే ఉన్నా.. ఈ మ్యాచులకు ఉపయోగించబోయే క్రికెట్ వేదికపై మాత్రం తీవ్ర విమర్శలొస్తున్నాయి. తక్కువ మంది వీక్షించే అవకాశం ఉండటమే అందుకు ప్రధాన కారణం. క్రికెట్ మ్యాచ్‌లు జరుగు యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌లో కేవలం 12 వేల మంది మాత్రమే ప్రత్యక్షంగా వీక్షించగలరు.    

ఇన్నాళ్లూ క్రికెట్ గ్రౌండ్ అంటే.. రౌండ్‌గా లేదంటా అక్కడక్కడా కాస్త స్క్వేర్ షేప్‌లో ఉండటం చూశాం. కానీ హాంగ్‌జౌలోని జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌ మాత్రం విభిన్నం. రోడ్డు నిర్మాణం కోసం స్టేడియంలో కొంత భాగాన్ని కోసినట్లుగా ఉంటుంది. అందునా నలువైపులా కూర్చుని మ్యాచ్‌ను వీక్షించలేరు. ఒకవైపుకు మాత్రమే దానిని పరిమితం చేశారు. దీన్ని చూసిన అభిమానులు.. క్రికెట్ స్టేడియాలు ఇలా కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు.

స్టేడియం మాత్రం చూడగానే ఆకట్టుకునేలా ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చని వాతావరణం.. అత్యాధునిక సౌకర్యాలు.. అబ్బో ఇలా చెప్పడానికి పలు విశేషాలు ఉన్నాయనుకోండి. కాకుంటే తక్కువ మందికి మాత్రమే వీక్షించే అవకాశం ఉండటం కాస్త నిరాశ కలిగిస్తోంది. పైగా బౌండరీలు కూడా దగ్గరగా ఉండటంతో ఆసియా గేమ్స్‌లో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే చైనాలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే కావడం విశేషం. ఆసియాలోని అన్ని క్రికెట్ దేశాలు ఈ గేమ్స్ లో తలపడనున్నాయి. మొత్తం 18 జట్లు పురుషుల క్రికెట్‌లో పోటీపడనున్నాయి.

ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్ మ్యాచులను 2010లో తొలిసారి నిర్వహించారు. అయితే భారత జట్లు పాల్గొనటం మాత్రం ఇదే తొలిసారి. పురుషుల జట్టుకు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వం వహించనుంది.

ఆసియా గేమ్స్ భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షెహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, శివం మావీ, శివం దూబే, ప్రభ్‍సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్).

స్టాండ్‍బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిశోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.

ఆసియా గేమ్స్ భారత మహిళల జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‍జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టితాస్ సంధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్నూ మణి, కనిక అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), అనూష బారెడ్డి

స్టాండ్‍బై ప్లేయర్స్: హర్లీన్ డియోల్, కశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్.