సఫారీ టూర్‌కు బీసీసీఐ రెడీ
ఐపీఎల్‌పై కూడా దృష్టి పెట్టిన బోర్డు
గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరి
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. జస్ట్ రెండు, మూడు నెలల్లో క్రికెట్ లైవ్ యాక్షన్‌ను చూడొచ్చు..! పోస్ట్ కరోనాలో క్రికెట్‌ను రీస్టార్ట్ చేసేందుకు బీసీసీఐ కొత్త ప్లాన్స్ సిద్ధం చేస్తోంది..:! అందులో భాగంగానే ఆగస్ట్ ఎండ్‌లో సౌతాఫ్రికా టూర్‌కు వెళ్తున్నట్లు సంకేతాలిచ్చింది..! దీంతో ఐపీఎల్‌కు కూడా రూట్ క్లియర్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది..! అయితే మధ్యలో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలనే చిన్న క్లాజ్ పెట్టినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు..!
సో.. అభిమానులారా మళ్లీ ధనాధన్ పోరుకు బీ.. రెడీ..!!
న్యూఢిల్లీ: ఓవైపు ఐపీఎల్‌ను పట్టాలెక్కించాలి.. మరోవైపు బైలేటరల్ సిరీస్‌లను కొనసాగించాలి.. మధ్యలో ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవాలి.. ప్రస్తుతం బీసీసీఐ టార్గెట్ ఇది. అందుకే వీలైనంత త్వరగా క్రికెట్‌ను రీస్టార్ట్ చేసేందుకు భారీ ప్రణాళికలే సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కీలకమైన ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని ఆగస్ట్ నెలాఖరులో సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. అన్నీ కుదిరితే అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహిస్తామని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ చెప్పి రోజు కూడా గడవకముందే.. సఫారీ టూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిగతా దేశాలు క్రికెట్‌ను మొదలుపెట్టేందుకు గైడ్‌లైన్స్, పర్మిషన్లు అని చెబుతున్నా.. బీసీసీఐ మాత్రం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతి కావాలని పైకి చెబుతున్నా.. ఇది పెద్ద సమస్య కాబోదని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. జులైలో ఇండియాతో సిరీస్ ఆడేందుకు శ్రీలంక కూడా రెడీగా ఉంది. అయితే దీనిపై మన బోర్డు నుంచి ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేకపోయినా సఫారీ టూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని బట్టి ఈ టూర్‌ను కూడా కొనసాగించే చాన్సెస్ కనబడుతున్నాయి. ఎందుకంటే ఆర్థిక నష్టాలను భర్తీ చేసుకోవాలంటే ప్రతి సిరీస్ ముఖ్యమే. ఇక సౌతాఫ్రికాతో సిరీస్ విషయాన్ని ఆ దేశ బోర్డు యాక్టింగ్ సీఈఓ జాక్వస్ ఫాల్ ధ్రువీకరించారు. ఈ సిరీస్ విషయంలో ఇరుదేశాల బోర్డులు సానుకూలంగా ఉన్నాయన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం టీ20 సిరీస్ పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోందన్నారు. బీసీసీఐ, సీఎస్‌ఏ మధ్య జరిగిన వర్చ్యూవల్ మీటింగ్ వివరాలను జాక్వస్ గురువారం వెల్లడించారు. ఇప్పటికైతే టీ20 సిరీస్‌ను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని చెప్పిన అతను.. ఒకవేళ వాయిదా పడినా వీలైనంత త్వరగా మళ్లీ పట్టాలెక్కిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టూర్‌కు తాము కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘అన్నింటికంటే ముందు మేము ప్లేయర్లను గ్రీన్ జోన్‌కు తరలించి ఓ కండిషనింగ్ క్యాంప్ నిర్వహించాలి. పరిస్థితులు అదుపులోకి వచ్చి, ప్రభుత్వం ఒప్పుకుంటే సౌతాఫ్రికా టూర్‌కు ఇబ్బంది లేదు’ అని ఆ అధికారి స్పష్టం చేశారు.
ఖాళీ స్టేడియంలోనే..
ఇండియాతో టీ20 సిరీస్ సీఎస్‌ఏకు ఆర్థికంగా చాలా అవసరం. సిరీస్ నిర్వహణకు ప్రొటీస్ బోర్డు ఇప్పటికే తమ ప్రభుత్వ అనుమతి కోరిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖాళీ స్టేడియంలో సిరీస్ నిర్వహించేందుకు తాము సిద్ధమేనని సీఎస్‌ఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గ్రేమ్ స్మిత్ కూడా గురువారం అన్నాడు. ‘మూడు టీ20ల సిరీస్‌కు కమిట్‌మెంట్ ఇవ్వాలని బీసీసీఐని కొన్ని రోజులుగా కోరుతున్నాం. ఎట్టకేలకు అది దొరికింది. ఆగస్టు నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కానీ క్రికెట్‌లో ప్లేయర్ల మధ్య కాంటాక్ట్ చాలా తక్కువ. అదే మా నమ్మకం. ప్రేక్షకులు లేకుండానైనా ఖాళీ స్టేడియంలో సిరీస్ జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని స్మిత్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ కోసమేనా ?
నిజానికి సౌతాఫ్రికా టూర్ విషయంలో బీసీసీఐ పాజిటివ్ రెస్పాన్స్‌కు ఐపీఎల్ కూడా ఓ కారణం. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ పోస్ట్‌పోన్ అయితే ఆ విండోలో ఐపీఎల్ ఉంటుందని ఇటీవల ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇదే జరిగి అక్టోబర్-–నవంబర్ విండోలో ఐపీఎల్ నిర్వహించాల్సి వస్తే.. అప్పుడు సీఎస్‌ఏ మద్దతు తమకు దొరుకుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఇండియాలో జూన్-–సెప్టెంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది. అయితే పరిస్థితులు అనుకూలిస్తే వర్షాకాలం తర్వాత ఫారిన్ క్రికెటర్లతో ఐపీఎల్ నిర్వహిస్తామని జోహ్రీ హింట్ ఇచ్చారు. దీంతో ఐపీఎల్ కోసమే సఫారీ టూర్‌కు ఓకే చెప్పారనే వాదనకు బలం చేకూరుతోంది. ‘పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నాం. అన్ని అదుపులోకి వస్తే తగిన విధంగా నిర్ణయం తీసుకోవచ్చు. వరల్డ్‌లోని బెస్ట్ ప్లేయర్లు అందరూ కలిసి ఆడటమే ఐపీఎల్‌లో హైలెట్. ఆ ఫ్లేవర్‌ను మెయింటేన్ చెయ్యాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఫ్లైట్స్ లేవు. కానీ ఏదో ఒక టైమ్‌లో ఎయిర్ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. అంతేకాక బరిలోకి దిగే ముందు ప్లేయర్లందరూ క్వారంటైన్ ఉండాలన్న విషయాన్ని మరచిపోకూడదు. క్వారంటైన్ వల్ల అందరి షెడ్యూల్ మరింత బిజీ అవుతుంది. వర్షాకాలం తర్వాత పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నాం. అప్పుడు ఐపీఎల్‌పై తగిన నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు.
For More News..