
- 9 వికెట్ల తేడాతో చెన్నై చిత్తు
ముంబై: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 45 బాల్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 నాటౌట్) ఫిఫ్టీతో ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన వేళ.. సూర్యకుమార్ యాదవ్ (30 బాల్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 నాటౌట్) కూడా ప్రతాపం చూపడంతో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ సాధించింది. ఇంకోవైపు వరుసగా ఐదు ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో గెలుపు బాట పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరో పరాజయంతో మళ్లీ డీలా పడ్డది. ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 వికెట్ల తేడాతో సీఎస్కేను ఓడించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే తొలుత 20 ఓవర్లలో 176/5 స్కోరు చేసింది. రవీంద్ర జడేజా (35 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్), శివం దూబే (32 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) ఫిఫ్టీలతో మెరిశారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 79 రన్స్ జోడించారు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (5), షేక్ రషీద్ (19) నిరాశపరిచినా.. అరంగేట్రం కుర్రాడు, 17 ఏండ్ల ఆయుష్ మాత్రే (15 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) డేరింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. చివర్లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ (4) ఫెయిలయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా (2/25) రెండు, శాంట్నర్ (1/14), దీపక్ చహర్ (1/32), అశ్వని కుమార్ (1/42) తలో వికెట్ తీశారు. అనంతరం ఛేజింగ్‌లో ముంబై 15.4 ఓవర్లలోనే 177/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రోహిత్ స్టార్టింగ్ నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్లతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (24)తో తొలి వికెట్‌కు 63 రన్స్ జోడించి విజయానికి పునాది వేశాడు. ఆపై, సూర్య కుమార్ తనమార్కు షాట్లతో సీఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పతిరణ వేసిన 16వ ఓవర్లో రోహిత్ సిక్స్ కొట్టగా.. సూర్య వరుసగా రెండు సిక్సర్లతో మరో 26 బాల్స్ మిగిలుండగానే మ్యాచ్ ముగించాడు. సూర్యతో రెండో వికెట్‌కు అజేయంగా 114 రన్స్ జోడించిన రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
- చెన్నై: 20 ఓవర్లలో 176/5 (జడేజా 53*, దూబే 50, బుమ్రా 2/25)
- ముంబై: 15.4 ఓవర్లలో 177/1 (రోహిత్ 76*, సూర్య 68*,
- జడేజా 1/28).