అంబటి రాయుడు.. భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరిది. తనదైన ఆటతో అందర్ని ఆకట్టుకునే ఈ క్రికెటర్ మన తెలుగువాడే. అతని స్వస్థలం గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం వెల్లలూరు. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌లోకి చిన్న తనంలోనే అడుగుపెట్టిన రాయుడు.. తొలి నాళ్ళలోనే తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ సమయంలోనే అతడిని అందరూ మరో సచిన్ అని పిలిచేవారట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. అతడు ఎంతటి ప్రతిభావంతుడో. అలాంటి రాయుడిలో కొందరికి నచ్చనిది ఒకటుంది.. అదే అతడి దూకుడు నైజం. ఈ కారణంగానే ఎన్నో అవకాశాలను చేజేతులా పోగొట్టుకున్నాడు.
శివలాల్ యాదవ్ కుమారుడడితో గొడవ
రాయుడిగా ముక్క సూటి మనిషి అనేది ఎంత వాస్తవమో.. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేడు అనేది అంతే నిజం. కెరీర్ తొలి రోజుల్లో రంజీ క్రికెట్ ఆడే సమయంలో భారత మాజీ క్రికెటర్, అప్పటి మాజీ బీసీసీఐ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్‌తో కయ్యానికి కాలుదువ్వాడు. ఈ ఘటన అప్పట్లో ఓ సంచలనం. వీరిద్దరూ భౌతికంగా కొట్టుకున్నట్లు అప్పట్లో పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఆ గొడవతో రాయుడి కెరీర్ డేంజర్ జోన్‌లో పడింది. శివలాల్ యాదవ్ బీసీసీఐ అధ్యక్షుడు అవ్వడంతో అతని వర్గం నుంచి రాయుడికి సమస్యలు ఎదురయ్యాయి.
ఐసీఎల్‌లో చేరిక.. బీసీసీఐ నిషేధం
శివలాల్ యాదవ్ నుంచి సమస్యలు ఎదురవ్వడంతో రాయుడు 21 ఏళ్లకే బీసీసీఐకి రెబెల్‌గా మారాడు. బీసీసీఐకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)లో చేరి నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తరువాత 2009లో రాయుడు సహా ఐసీఎల్‌లో ఆడిన 79 మంది భారత క్రికెటర్లకు బీసీసీఐ క్షమాభిక్ష పెట్టడంతో.. రాయుడు మళ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి వచ్చాడు.
ముంబై ఇండియన్స్
నిషేధం అనంతరం ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ చెంతకు చేరిన రాయుడు.. ఆ జట్టు ఐపీఎల్ టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనికి తొలిసారి 2013లో భారత జట్టుకు ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఆ అవకాశాలను రాయుడు సద్వినియోగ పరుచుకోలేదు. అడపాదడపా రాణించినా సెలెక్టర్లు అతన్ని పట్టించుకునేవారు కాదు. ఆ సమయంలో భారత జట్టులో కీలక ఆటగాళ్లందరూ తప్పుకోవడంతో బీసీసీఐ.. బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం వెతకటం మొదలుపెట్టింది. అప్పుడే విజయ్ శంకర్ వారి కళ్లలో పడ్డాడు. ఒకవైపు రాయుడు విఫలమవుతుండటం.. మరోవైపు విజయ శంకర్ మంచి ఆల్‌రౌండర్ కనబడటంతో మేనేజ్‌మెంట్ అతన్ని ఎంపిక చేసింది. దీంతో రాయుడికి 2015 వన్డే ప్రపంచకప్ తుది జట్టులో చోటు దక్కలేదు.
3D ట్వీట్ చిచ్చు
వన్డే ప్రపంచకప్ తుది జట్టులో చోటు దక్కలేదన్న బాధతో రాయుడు..విజయ్ శంకర్ ని ఉద్దేశిస్తూ త్రీడీ ప్లేయర్ అంటూ అవమానపరిచేలా కామెంట్ చేశాడు. 'త్రీడీ గ్లాస్ ఆర్డర్ చేశా. ప్రపంచకప్‌ను వాటితోనే చూస్తా..' అంటూ అతన్ని సెలెక్ట్ చేసిన బీసీసీఐ సెలెక్షన్ ప్యానల్ పైనా సెటైర్లు పేల్చాడు. ఇది బీసీసీఐకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ కారణంగా 2015 వన్డే ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న రాయుడిని అవకాశమొచ్చినా పక్కనపెట్టింది. ఆ కోపంతో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అతను.. ఐపీఎల్‌కే ఆడుతున్నాడు.
ఇలా ఒకటి.. రెండు అని కాదు.. అతని క్రికెట్ ప్రయాణంలో ఎన్నో గొడవలు. 2012 ఐపీఎల్ సమయంలో భారత బౌలర్ హర్షల్ పటేల్‌ను దూషించటం.. 2014లో ఇండియా-ఏ తరుపున ఆడుతున్న సమయంలో అంపైర్లతో గొడవ.. ఐపీఎల్ ప్రయాణంలో తన సహచర ఆటగాళ్ళైన హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో గొడవ పడిన సందర్భాలూ.. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ పైకి దూసుకెళ్ళటం ఇలా ఎన్నో ఉన్నాయి. అందునా ఉప్పల్ స్టేడియం బయట రాయుడు.. ఓ వృద్దుడితో గొడవపడిన ఘటన మరో కథ.
రాజకీయం.. క్రికెట్ ఒక్కటి కాదు
వీటన్నిటికీ మించి ఇప్పుడు రాయుడు రాజకీయ ప్రయాణం మరింత ఆసక్తి రేపుతోంది. ప్రజా సేవ చేయాలని ఉందంటూ రాజకీయాలోకి ఎంట్రీ ఇచ్చిన రాయుడు.. ఇక్కడా అలాంటి దుందుడుకు స్వభావమే చూపిస్తున్నాడు. గత నెల డిసెంబర్ 28న అధికారికంగా వైసీపీలో జాయిన్ అయిన అతను.. తొమ్మిది రోజులకే ఆ పార్టీ వీడాడు. అధిష్టానానికి, ఇతనికి మధ్య ఎక్కడ చెడిందో కానీ.. జగన్ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు రాయుడు శుక్రవారం(డిసెంబర్ 6) ప్రకటన చేశాడు. వైఎస్ ఆర్ సీపీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపిన రాయుడు.. కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. చూశారుగా.. మన తెలుగుతేజానికి ఎన్ని బాధలో.. అందుకే మన నెటిజెన్లు అందరూ అతనికి రాజకీయం.. క్రికెట్ ఒక్కటి కాదు రాయుడు అని దిశానిర్ధేశం చేస్తున్నారు.