పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ఈ సామెత ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా, 2023 వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆ స్థాయిలో మాత్రం రాణించట్లేదు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడటం పెద్ద విషయం కాకపోయినా.. పసికూన అప్ఘానిస్థాన్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కోవటం వారిని తలెత్తుకోకుండా చేస్తోంది. తాజాగా ఈ ఓటమిపై స్పందించిన ఆ జట్టు ఓపెనర్ జానీ బెయిర్‌స్టో.. ఒక్క ఫలితం తమ ఆటపై, తమ అంచనాలపై ప్రభావం చూపదని తెలిపాడు.
"ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన మా ఆటపై ఎలాంటి ప్రభావం ఉండదు. వారు బాగా ఆడారు.. మేము తగినంతగా ఆడలేకపోయాము. ఆ ఓటమిని మరిచిపోయి ముందుకు సాగాలి. మా జట్టు బలాబలాలపై మాకు నమ్మకం ఉంది. 2019 వన్డే ప్రపంచ కప్, 2023 టీ20 ప్రపంచ కప్ గెలవడం వెనకున్న కారణాలు మాకు తెలుసు. కలిసి కట్టుగా విజయాలు సాధించగలమనే నమ్మకముంది. మేము డిఫెండింగ్ ఛాంపియన్లం.." అని బెయిర్‌స్టో తెలిపాడు.
ఒక్కటే విజయం
ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడగా.. ఆ తరువాత బంగ్లాదేశ్‌పై విజయాన్ని అందుకుంది. ఆపై ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్.. తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 21న ముంబై, వాంఖడే వేదికగా జరగనుంది.