'కేఎల్ రాహుల్..' భారత క్రికెటర్లలో ఇతని అంతటి దురదృష్టవంతుడు మరొకరు లేరు. ఇతను ఆడినా విమర్శలే.. ఆడకపోయినా విమర్శలే. ఆడితే.. స్ట్రైక్ రేట్ లేదంటారు.. ఆడకపోతే జట్టులో ఎందుకని ప్రశ్నిస్తారు. ఈ విమర్శలన్నింటికి రాహుల్.. తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగులు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో అతడిని విమర్శించిన నోర్లే.. ఇప్పుడు ప్రశంసిస్తున్నాయి.
ఒకవైపు ఇలా నిత్యం క్రికెట్ ఆడుతూ బిజీగా గడిపే రాహుల్.. పేద విద్యార్థి చదవుకు ఆర్థికసాయం చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు. కర్ణాటక, ధార్వాడ పరిధిలోని సిద్దేశ్వర్ కాలనీకి చెందిన హనుమంతప్ప-సుమిత్ర దంపతులకు సృష్టి అనే కుమార్తె ఉంది. డాక్టర్ కావాలన్నది ఆ బాలిక కోరిక.. కానీ ఆ చిన్నారి ప్రాథమిక విద్యకే పేదరికం అడ్డంకిగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త మంజునాథ్ హెబాసూర్.. ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితులను రాహుల్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన రాహుల్ చిన్నారి చదువుకు అవసరమైన ఆర్థిక సహాయం అందజేశాడు.
గ్లోబల్ స్కూల్ అఫ్ ఎక్సలెన్స్‌లో చిన్నారి చదువు
దీపకా గాంకర్, అనితా గాంకర్ ఆధ్వర్యంలో 1996లో ప్రారంభమైన గ్లోబల్ స్కూల్ అఫ్ ఎక్సలెన్స్ కు ధార్వాడలో మంచి పేరుంది. ఈ పాఠశాలలో సృష్టి చదువుకోవడానికి రాహుల్ ఆర్థిక సాయం అందించారు. ఇది తమ పాఠశాలకు, తమకు గర్వకారణమని పాఠశాల ప్రిన్సిపాల్ మాలాశ్రీ నయ్యర్ చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన అభిమానులు, నెటిజన్లు రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.