భారత మాజీ క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేశాడని అతనిపై కేసు అయ్యింది. కన్నాపురానికి చెందిన బాలగోపాల్ ఫిర్యాదు మేరకు శ్రీశాంత్ సహా మరో ఇద్దరిపై కన్నూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏంటి ఈ కేసు..?
కర్ణాటకలోని కొల్లూరులో శ్రీశాంత్‌కు చెందిన స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని చెప్పి 2019 ఏప్రిల్ 25 నుంచి వివిధ తేదీల్లో ఇద్దరు నిందితులు రాజీవ్‌కుమార్, వెంకటేష్ తన నుంచి రూ.18.70 లక్షలు తీసుకున్నట్లు బాలగోపాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అకాడమీలో భాగస్వామి అయ్యే అవకాశం రావడంతోనే ఆ డబ్బును పెట్టుబడి పెట్టినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు ఆ మాటపై నిలబడకపోగా.. ఆ ప్లేస్‌లో మరో నిర్మాణం కోసం పనులు ప్రారంభించారట. ఈ విషయంపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కన్నూర్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు క్రికెటర్ శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై కన్నూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐపీసీ సెక్షన్ 420
ఈ కేసులో శ్రీశాంత్‌ను మూడో నిందితుడిగా చేర్చిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 420 (మోసం చేయడం, నిజాయితీగా ఆస్తుల పంపిణీని ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేశారు.