తండ్రైన భారత క్రికెటర్.. మగబిడ్డకు జన్మనిచ్చిన రొమానా జహూర్‌

తండ్రైన భారత క్రికెటర్.. మగబిడ్డకు జన్మనిచ్చిన రొమానా జహూర్‌

భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ ఇంట సంతోషం వెల్లివిరుస్తోంది. బెంగళూరు గడ్డపై న్యూజిలాండ్‌ పేసర్లను ధీటుగా ఎదుర్కొంటూ కెరీర్‌లో తొలి శతకం(150) నమోదు చేసిన ఈ క్రికెటర్ ఇంటికి వారసుడు వచ్చాడు. అతని సతీమణి రొమానా జహూర్‌ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకర విషయాన్ని సర్ఫరాజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు తెలియజేశాడు. బిడ్డను ఎత్తుకున్న ఫొటోలను పంచుకున్నాడు. ఇది తెలిసి అభిమానులు, సహచరులు అతనికి శుభాకాంక్షలు చెప్తున్నారు.

ALSO READ | IND Vs NZ: 150 కొట్టినా సర్ఫరాజ్‌ను తప్పించండి.. భారత మాజీ వికెట్ కీపర్ డిమాండ్

గతేడాది ఆగస్టు 06న రోమానా జహూర్‌తో సర్ఫరాజ్‌ ఖాన్‌కు వివాహమైంది. ఆమె స్వస్థలం జమ్మూ  కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా. ఈ ఏడాది ఆరంభంలో రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌ తో జరిగిన టెస్టు సిరీస్‌తో సర్ఫరాజ్ టీమిండియా తరుపున టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా అతను టోపీని అందుకున్నాడు. ఆ సమయంలో భార్య రోమానా, తండ్రి నౌషద్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఆ సిరీస్‌లో ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ మూడు మ్యాచ్‌ల్లో మూడు అర్ధసెంచరీలతో 200 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి శతకం

ఇక, ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఈ 26 ఏళ్ల బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్ లో తొలి శతకాన్ని అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులతో జట్టును ఘోర ఓటమి నుంచి తప్పించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడి సెన్సేషన్‌ అయ్యాడు. అయినప్పటికీ, భారత జట్టు పరాజయం పాలైంది అనుకోండి.. అది మరో విషయం. నాలుగో రోజు ఆటలో రిషబ్ పంత్‌తో కలిసి అతను 250 పైచిలుకు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడమంటే మాటలు కాదు. అందుకే, మ్యాచ్ ముగిసిన అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ అతని ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపించాడు.