Shikhar Dhawan: గబ్బర్ గుడ్‌‌‌‌బై.. క్రికెట్‌‌‌‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్

  •    14 ఏండ్ల కెరీర్‌‌‌‌లో 269 మ్యాచ్‌‌‌‌లు, 10 వేలకు పైగా రన్స్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా వెటరన్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌ శిఖర్‌‌‌‌ ధావన్.. ఇంటర్నేషనల్‌‌‌‌, డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పాడు. రెండేండ్ల నుంచి జట్టుకు దూరమైన అతను శనివారం అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు ప్రకటించాడు. ‘నా క్రికెట్‌‌‌‌ ప్రయాణాన్ని ఇంతటితో ముగిస్తున్నా. లెక్కలేనన్ని జ్ఞాపకాలను, కృతజ్ఞతలను నా వెంట తీసుకెళ్తున్నా. ఇన్నాళ్లూ నాకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌‌‌‌. జై హింద్‌‌‌‌. జీవితంలో ముందుకు సాగడానికి పేజీని తిప్పడం చాలా ముఖ్యం. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌‌‌‌కు రిటైర్మెంట్‌‌‌‌ ప్రకటిస్తున్నా. చాలా ఏండ్ల పాటు దేశానికి సేవలందించిందుకు చాలా సంతోషంగా ఉంది’ అని 38 ఏళ్ల ధవన్‌‌‌‌ ఎక్స్‌‌‌‌లో పోస్ట్‌‌‌‌ చేశాడు. 

2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో వన్డేల్లో అరంగేట్రం చేసిన ధవన్‌‌‌‌.. 14 ఏళ్ల కెరీర్‌‌‌‌లో 167 మ్యాచ్‌‌‌‌లు ఆడాడు. 17 సెంచరీలు, 39 హాఫ్‌‌‌‌ సెంచరీలు సహా 6793 రన్స్‌‌‌‌ చేశాడు. 2022లో బంగ్లాదేశ్‌‌‌‌తో చివరి వన్డేలో పోటీపడ్డాడు.  2013లో మొహాలీలో  ఆసీస్‌‌‌‌పై టెస్టు అరంగేట్రం చేసిన ధవన్‌‌‌‌.. 2018లో ఇంగ్లండ్‌‌‌‌తో చివరి మ్యాచ్‌‌‌‌ ఆడాడు. 34 టెస్టుల్లో 2315 రన్స్‌‌‌‌ చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 ఫిఫ్టీలు ఉన్నాయి. సగటు 40.61గా ఉంది. 2011లో వెస్టిండీస్‌‌‌‌పై తొలి టీ20 ఆడిన ధవన్‌‌‌‌ 68 మ్యాచ్‌‌‌‌ల్లో 27.92 సగటుతో 1759 రన్స్‌‌‌‌ చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021లో శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్‌‌‌‌ ఆడాడు. 

రియల్‌‌‌‌ ఫైటర్‌‌‌‌..

వెస్ట్‌‌‌‌ ఢిల్లీలోని సోనెట్‌‌‌‌ క్లబ్‌‌‌‌ నుంచి క్రికెట్‌‌‌‌ మొదలుపెట్టిన ధవన్‌‌‌‌ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. తొలి మ్యాచ్‌‌‌‌లో రెండు బాల్స్​ ఆడి డకౌటయ్యాడు. కానీ తర్వాతి దశలో తన బ్యాటింగ్‌‌‌‌తో అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియాలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని సృష్టించుకున్నాడు. జట్టు క్లిష్ట సమయాల్లో ఉన్నా.. తాను గాయాలతో ఇబ్బందిపడినా ఓ ఫైటర్‌‌‌‌గా టీమిండియాకు అమూల్యమైన సేవలు అందించాడు. అందుకే అతన్ని తోటి ఆటగాళ్లు గబ్బర్‌‌‌‌ అని ముద్దుగా పిలుస్తారు. 2013 నుంచి అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా పాతుకుపోయాడు. 

ఇంగ్లండ్‌‌‌‌లో జరిగిన చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీలో  దంచికొట్టి ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద టోర్నీగా నిలిచిన ధావన్ ఓ వెలుగు వెలిగాడు. ఆసీస్‌‌‌‌పై తొలి టెస్ట్‌‌‌‌లోనే 185 రన్స్‌‌‌‌ చేయడం, అందులో 85 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ కొట్టడం ధవన్‌‌‌‌ కెరీర్‌‌‌‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌‌‌‌. ‘ప్రస్తుతం నేను ఓ కీలక పాయింట్‌‌‌‌ దగ్గర ఉన్నా. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో జ్ఞాపకాలు. ముందుకెళ్తే కొత్త జీవితం. దేశం కోసం ఆడాలన్నది నా కల. అదృష్టవశాత్తు అది నాకు లభించింది. డీడీసీఏ, బీసీసీఐ, ఫ్యాన్స్‌‌‌‌కు ఇందుకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఇండియాకు మరోసారి ప్రాతినిధ్యం వహించే చాన్స్‌‌‌‌ లేదు. అయినా ఇన్నాళ్లూ ఆడిన సంతృప్తి మాత్రం ఉంది’ అని ధవన్‌‌‌‌ వ్యాఖ్యానించాడు. 2019 వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో డిసెంబర్‌‌‌‌ 5న ఆసీస్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో ధవన్‌‌‌‌కు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. కమిన్స్‌‌‌‌ వేసిన బాల్‌‌‌‌ బొటన వేలికి తాకడంతో నొప్పితో విలవిలలాడాడు. చికిత్స తీసుకున్నా నొప్పి తగ్గలేదు. అయినా ఆటను కొనసాగించి సెంచరీతో ఇండియాను గెలిపించి రియల్‌‌‌‌ ఫైటర్‌‌‌‌ అనిపించుకున్నాడు. 

ఐపీఎల్‌‌‌‌‌లోనూ అదుర్స్

ఐపీఎల్‌‌‌‌నూ ధవన్‌‌‌‌ తన ముద్ర వేశాడు. హైదరాబాద్‌‌‌‌, ఢిల్లీ, ముంబై, పంజాబ్‌‌‌‌ తరఫున అతను 222 మ్యాచ్‌‌‌‌లు ఆడాడు. 2 సెంచరీలు, 51 హాఫ్‌‌‌‌ సెంచరీలతో 6769 రన్స్‌‌‌‌ చేశాడు. 768 ఫోర్లతో టోర్నీ టాపర్‌‌‌‌గా ఉన్నాడు. అలాగే మెగా టోర్నీలో వరుసగా రెండు సెంచరీలు కొట్టిన రికార్డు కూడా అతని పేరుమీదే ఉంది. 2016లో హైదరాబాద్‌‌‌‌ జట్టు ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో  కీలక పాత్ర పోషించాడు.  గత  సీజన్‌‌‌‌లో పంజాబ్‌‌‌‌ తరఫున ఆడిన ధవన్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సమస్యలతో కేవలం ఐదు మ్యాచ్‌‌‌‌ల్లోనే బరిలోకి దిగాడు. ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పిన ధవన్‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌లో కొనసాగే చాన్స్‌‌‌‌ ఉంది.

రోహిత్‌‌‌‌ జతగా..

సచిన్‌‌‌‌ రిటైర్మెంట్‌‌‌‌ తర్వాత రోహిత్‌‌‌‌, ధవన్‌‌‌‌ తమ ఓపెనింగ్‌‌‌‌తో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. ఇప్పటికి ఇండియా రికార్డుల్లో రోహిత్‌‌‌‌–ధవన్‌‌‌‌ ఓపెనింగ్ జోడీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ‘ఇండియాకు ఆడాలన్నదే నా ఏకైక లక్ష్యం. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫ్యామిలీ మద్దతుతో చిన్ననాటి కోచ్‌‌‌‌ తారక్‌‌‌‌ సిన్హా వద్ద క్రికెట్‌‌‌‌ నేర్చుకున్నా. ఆ తర్వాత నేను ఆడిన ప్రతి జట్టు నా  వెన్నంటి నిలిచింది. తోటి ఆటగాళ్లంతా చాలా మద్దతుగా నిలిచారు. ఇకపై నేను మీతో (తోటి ఆటగాళ్లు) కలిసి దేశం కోసం ఆడనందుకు బాధపడకండి. మీరు మాత్రం దేశం కోసం ఆడుతూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి’ అని ధవన్‌‌‌‌ పేర్కొన్నాడు.