దేశ రాజధాని ఢిల్లీలో సాహిల్ అనే యువకుడు సాక్షి అనే 16 ఏళ్ల బాలికను అతి కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. తనను పట్టించుకోవడం లేదన్నా అక్కసుతో సదరు యువకుడు.. మైనర్ బాలికను 21 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఆ హత్యను ప్రస్తావిస్తూ 'లవ్ జిహాద్' పేరుతో గుజరాత్ టైటాన్స్ యువ బౌలర్ 'యష్ దయాల్' ఓ వివాదాస్పద పోస్ట్ చేశారు. అది నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. నెటిజన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నా..
యశ్ దయాల్ చేసిన ఇన్స్టా పోస్ట్‌లో.. 'లవ్ జిహాద్ లేనే లేదు, అదంతా తప్పుడు ప్రచారం. నిజంగానే నేను నిన్ను ప్రేమిస్తున్నా..' అంటూ ఓవర్గానికి చెందిన వ్యక్తి పైకి ప్రేమగా నటిస్తూ, వెనుక కత్తి పట్టుకొని.. కళ్లకు గంతలు కట్టి ఉన్న ఓ యువతికి ప్రపోజ్ చేస్తాడు. అందుకు ఆమె బదులిస్తూ.. 'నువ్వు అలాంటి వాడివి కాదని నాకూ తెలుసు అబ్దుల్. నేను నిన్ను గుడ్డిగా నమ్ముతున్నా..' అంటూ సమాధానమిస్తుంది. అయితే ఆ పోస్ట్‌లో సదరు యువకుడు అప్పటికే పలువురిని హత్య చేసినట్లుగా ఉంది.
క్షమించండి.. పొరపాటు చేశా..
తన పోస్ట్ వివాదంగా మారడంతో దయాల్ వెంటనే దానిని తొలగించడమే కాకుండా... క్షమాపణలు చెబుతూ మరో పోస్ట్ పెట్టాడు. 'అందరూ నన్ను క్షమించండి. గత పోస్ట్ అనుకోకుండా చేసింది. సమాజంలోని ప్రతి మతం పట్ల నాకు గౌరవం ఉంది. దయచేసి విద్వేషాన్ని వ్యాప్తి చేయకుండి..' అని యశ్ మరో పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఏదేమైనా ఒక క్రికెటర్, ఇలాంటి పోస్ట్ చేయడం సోషల్ మీడియాను షేక్ చేసిందనే చెప్పాలి.