ఒకప్పుడు స్టార్ క్రికెటర్లు…ఇప్పుడు బస్సు డ్రైవర్లు

ఒకప్పుడు స్టార్ క్రికెటర్లు…ఇప్పుడు బస్సు డ్రైవర్లు

భార‌త్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో క్రికెటర్లు ఒక సారి జాతీయ జ‌ట్టుకు ఎంపికైతే చాలు వారి ద‌శ తిరిగిన‌ట్లే. లైఫ్ హ్యాపిగా గ‌డిపిపోతుంది. కానీ మిగ‌తా దేశాల్లో అలాంటి ప‌రిస్థితి లేదు. ఆయా దేశాలు త‌మ క్రికెట‌ర్ల‌కు ఇచ్చే మ్యాచ్ ఫీజులు కూడా చాలా త‌క్కువే.దీంతో ఉపాధి కోసం ఇతర పనులు కూడా చేస్తున్నారు. శ్రీలంక, జింబాబ్వేకు చెందిన మాజీ ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు.

శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సూరజ్ రణదీవ్, చింతక జయసింఘే, జింబాబ్వే మాజీ ఆటగాడు వాడింగ్టన్ ఎంవెయెంగా ప్ర‌స్తుతం మెల్‌బోర్న్‌లో స్థానికంగా ఉన్న ఓ క్ల‌బ్ త‌రుపున క్రికెట్ ఆడుతూనే.. ట్రాన్స్ డెవ్ అనే ఫ్రెంచ్ కంపెనీకి చెందిన బస్సులు నడుపుతున్నారు. ట్రాన్స్ డెవ్ సంస్థ విభిన్న రంగాలకు చెందిన దాదాపు 1,200 మందిని డ్రైవర్లుగా నియమించుకుంది. వారిలో ఈ ముగ్గురు క్రికెటర్లు కూడా ఉన్నారు. క్రికెట్ ద్వారా త‌మ‌కు వ‌చ్చే ఆదాయం చాలా త‌క్కువ‌ని.. త‌మ కుటుంబాల‌ను పోషించ‌డం కోసం బ‌స్సు డ్రైవ‌ర్లగా చేరామ‌ని వారు చెబుతున్నారు.

సూరజ్ రణదీవ్ శ్రీలంక జట్టు తరపున 12 టెస్టులు, 31 వన్డేలు, 7 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 43 వికెట్లు తీశాడు. వాటిలో 5 వికెట్ల ప్రదర్శన ఒకసారి నమోదు చేశాడు. 4 వికెట్ల ప్రదర్శన మూడు సార్లు నమోదు చేశాడు. లంక జట్టు తరఫున చింతక జయసింఘే 5 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో ప్రాతినిధ్యం వహించాడు. జింబాబ్వేకు చెందిన వాడింగ్టన్ ఎంవెయెంగా 2005-06 సీజన్ లో ఒక టెస్టు, 3 వన్డేల్లో జాతీయ జట్టుకు ఆడాడు.