వనపర్తి, వెలుగు: జిల్లాలో పోలీస్ శాఖ కృషితో మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని ఎస్పీ రక్షిత కే మూర్తి తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇయర్ క్రైం రిపోర్ట్ వివరాలను వెల్లడించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పని చేసిందని చెప్పారు. మహిళలపై దాడులను తగ్గించేందుకు షీ టీమ్స్ కృషి చేశాయని తెలిపారు.
డయల్ 100 సేవలను మరింత మెరుగు పరిచామని, 3 నిమిషాల్లో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల నిర్మూలన కోసం స్పెషల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. షీ టీం ద్వారా 265 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1,412 మొబైల్ ఫోన్లలో 251 తిరిగి అప్పగించామని, 170 ఫోన్లను బ్లాక్ చేశామని తెలిపారు. వివిధ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేశామన్నారు. అడిషనల్ ఎస్పీ రామదాసు తేజావత్, సీఐలు మహేశ్వర్, రవిపాల్, శ్రీ రత్నం పాల్గొన్నారు.
గతంలో కన్నా క్రైమ్ రేట్ పెరిగింది..
గద్వాల: జిల్లాలో గత ఏడాదికన్నా క్రైమ్ రేట్ పెరిగిందని గద్వాల ఎస్పీ రితిరాజ్ తెలిపారు. వచ్చే ఏడాదిలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు. ఎస్పీ ఆఫీసులో శనివారం మీడియాకు వార్షిక నేర వివరాలు వెల్లడించారు. గత ఏడాది 2,019 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 2,278 కేసులు నమోదైనట్లు చెప్పారు. జూదం ఆడుతున్న 134 మందిపై కేసు నమోదు చేసి, రూ.4.22 లక్షలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో 35 మందిపై కేసు నమోదు చేసి 774.7 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాలో 154 మందిపై కేసు నమోదు చేసి 218 వాహనాలు సీజ్ చేశామన్నారు. జిల్లాలో 179 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 148 మందికి గాయాలు కాగా, 100 మంది చనిపోయారని తెలిపారు. 363 మందిపై 292 ఎక్సైజ్ కేసులు నమోదు చేశామన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో 2,620 కేసులు నమోదు కాగా, రూ.19.48 లక్షల ఫైన్ వసూలు చేసి, 66 మందిని జైలుకు పంపించామని తెలిపారు. ఎంవీఐ యాక్ట్ కింద 96,362 కేసులు నమోదు చేసి, రూ.7.28 కోట్లు ఫైన్లు విధించినట్లు చెప్పారు. జిల్లా ప్రజల సహకారంతో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అడిషనల్ ఎస్పీ రవి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.