పైసలన్నీ రెండో భార్యకే ఇస్తున్నడని తండ్రిని చంపిన కొడుకు

  • రామంతాపూర్​లో ఘటన

ఉప్పల్, వెలుగు: పైసలన్నీ రెండో భార్యకు ఇస్తున్నాడని తండ్రిని  కొడుకు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉప్పల్​ పీఎస్ పరిధిలో జరిగింది. వివేక్​నగర్​లోని సూర్య అపార్ట్ మెంట్​లో ఉండే పాండుసాగర్(54)కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.  పాండుసాగర్ అదే ఏరియాలో టెంట్​హౌజ్​నిర్వహిస్తున్నాడు. నాలుగేండ్ల కిందట పీర్జాదిగూడకు చెందిన విజయలక్ష్మి అనే మహిళను రెండో పెండ్లి చేసుకున్న పాండుసాగర్ ​ఆమెతోనే ఉంటున్నాడు. పాండుసాగర్ తమను పట్టించుకోవడడం లేదని, డబ్బులన్నీ విజయలక్ష్మికే ఇస్తున్నాడని కొడుకులు, మొదటి భార్య అతడిపై కోపంగా ఉన్నారు. 

దీంతో పెద్ద కొడుకు పవన్(25)తో కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. టెంట్ ​హౌజ్​ సామాన్లు పెట్టేందుకు పాండుసాగర్ ​ఈ మధ్యే రామంతాపూర్ పరిధి​ శ్రీనివాసపురంలోని ఓ అపార్ట్ మెంట్​లో ఫ్లాట్​ అద్దెకు తీసుకున్నాడు. పాండుసాగర్  సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆ ఫ్లాట్​లో​ఉండగా అక్కడకు వచ్చిన పవన్​ తమ వద్దకు ఎందుకు రావడం లేదని తండ్రిని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన పవన్​ టెంట్​ హౌజ్​లో ఉన్న పెద్ద సుత్తితో తండ్రి​తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ పాండుసాగర్​ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్​ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కేసు  ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడు పవన్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.