
మెదక్, కొల్చారం, వెలుగు: తన కూతురుపై కన్నేశాడని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ మరి కొందరితో కలిసి ప్రియుడిని హత్య చేసినట్లు మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు. కొల్చారం మండల పరిధిలోని మంజీరా నది వద్ద రెండు రోజుల కింద జరిగిన హత్య కేసు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాటి ఘనపూర్ కు చెందిన కావాలి రాములు (35)కు అదే మండలంలోని నందిగామకు చెందిన మ్యాదరి వీరమణితో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉంది. అయితే రాములు ఆమె కూతురుతో అసభ్యంగా ప్రవర్తించడం గమనించిన వీరమణి అతన్ని చంపాలని నిర్ణయించుకుంది.
ఈ మేరకు పథకం ప్రకారం ఈ నెల 25న రాములును మెదక్‌కు పిలిపించింది. ఫతేనగర్ వీధిలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి కౌడిపల్లికి చెందిన మ్యాదరి నర్సింలు, మెదక్ పట్టణం ఫతేనగర్ కు చెందిన మ్యాదరి అనిరుద్, స్వప్న, కౌడిపల్లికి చెందిన తక్వీర్ సింగ్, పట్నం మహేశ్, మహమ్మద్ ఆరీఫ్‌తో కలిసి ఇనుపరాడ్‌తో కొట్టి చంపేసింది. అనంతరం డెడ్ బాడీని ఒక గోనె సంచిలో పెట్టి, రాళ్లు కట్టి ఏడుపాయల సమీపంలోని మంజీరా నదిలో పడేశారు. డెడ్‌బాడీ చాతిమీద ఉన్న పచ్చబొట్ల ఆధారంగా మృతుడు పాటి ఘనపూర్‌కు చెందిన కావాలి రాములు గుర్తించి విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది. నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. 72 గంటల్లో హత్య కేసు చేదించిన పోలీసులను
అభినందించారు.