- మొత్తంగా మూడు జిల్లాల్లో 14,530 కేసులు నమోదు
- 1,526 రోడ్డు ప్రమాదాల్లో 487 మంది మృత్యువాత
- భారీగా పెరిగిన రేప్ కేసులు
- 911 చోరీ కేసుల్లో 486 మాత్రమే సాల్వ్
- 18 మంది నేరస్థులపై పీడీ యాక్ట్
- యాన్యువల్ క్రైమ్ రిపోర్టును రిలీజ్ చేసిన సీపీ అంబర్ కిశోర్ ఝా
హనుమకొండ, వెలుగు: వరంగల్ పోలీస్కమిషనరేట్పరిధిలో క్రైమ్‌రేట్ పెరిగింది. కిందటేడుతో పోలిస్తే నేరాలు తగ్గకపోగా, అధికమవడం ఆందోళన కలిగిస్తోంది. కమిషనరేట్పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో నిరుడు అన్నీ కలిపి 13,489 కేసులు నమోదవగా, ఈసారి 14,530 కేసులు రిపోర్టయ్యాయి. మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోయాయి. మర్డర్లు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు ఎక్కువయ్యాయి.
గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి రేప్కేసులు భారీగా పెరిగాయి. చోరీ కేసుల్లో రికవరీ రేటు చాలా తక్కువగా ఉంది. రూ.10.84 కోట్ల విలువైన సొత్తు చోరీకి గురికాగా.. పోలీసులు రూ.3.6 కోట్ల సొత్తును మాత్రమే రికవరీ చేశారు. మొత్తంగా 2022తో పోలిస్తే 2023లో క్రైమ్ రేట్ 7.71 శాతం పెరిగింది. మంగళవారం వరంగల్ కమిషనరేట్ ఆఫీసులో సీపీ అంబర్ కిశోర్ ఝా యాన్యువల్ క్రైమ్ రిపోర్టును రిలీజ్ చేశారు.
ఆగని యాక్సిడెంట్లు, చోరీలు
గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయి. 2021లో 1,180 ప్రమాదాలు జరిగి 460 మంది చనిపోగా, 2022లో 1,149 ప్రమాదాల్లో 438 మంది మృత్యువాతపడ్డారు. ఈసారి 1,526 యాక్సిడెంట్లు జరగగా.. 487 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా చోట్ల దొంగలు రెచ్చిపోయారు. నిరుడు 800 దొంగతనాలు జరగగా.. ఈసారి ఆ సంఖ్య 911కు పెరిగింది. కేసుల డిటెక్షన్ చాలా తక్కువగా ఉంది. 911 కేసుల్లో 486 కేసులను మాత్రమే పోలీసులు సాల్వ్ చేశారు. మొత్తంగా 10.84 కోట్ల విలువైన సొత్తు చోరీ కాగా, కేవలం 3.6 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు.
మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు
గడిచిన రెండేండ్లలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. మొత్తంగా మహిళలకు సంబంధించి 1,705 కేసులు రిపోర్టయ్యాయి. ఇందులో రేప్, పోక్సో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 2021లో రేప్, పోక్సో కేసులు కలిపి 96 ఫైల్అవగా, 2022లో 135 కేసులు ఫైల్ అయ్యాయి. ఈ ఏడాది ఆ సంఖ్య184కు చేరింది. 2022లో 41 మర్డర్లు జరగగా.. ఈసారి 44 జరిగాయి. ఇందులో కుటుంబ తగాదాల వల్లే 15 మర్డర్లు జరిగాయి. గతంతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీలపై దాడులు 2.28 శాతం తగ్గాయి. 2021లో ఎస్సీ, ఎస్టీ కేసులు 131 నమోదు కాగా.. 2022లో 176, 2023లో 172 కేసులు రిపోర్టయ్యాయి. ఇందులో భూవివాదాలకు సంబంధించినవే 37 కేసులుండటం గమనార్హం.
గంజాయి కేసులు తగ్గినయ్
గతంతో పోలిస్తే ఈసారి గంజాయి కేసులు తగ్గాయి. నిరుడు అత్యధికంగా 82 కేసుల్లో.. 6,623 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా.. 261 మంది అరెస్ట్ అయ్యారు. ఈ ఏడాది 73 కేసులు నమోదు కాగా.. 1,693 కేజీల సరుకును స్వాధీనం చేసుకున్నారు.160 మందిని అరెస్ట్ చేశారు. 2021లో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 30 మందిపై పీడీ యాక్ట్ప్రయోగించగా, 2022లో 43 మందిపై, ఈసారి ఐదుగురిపైనే పీడీ యాక్ట్కింద కేసులు నమోదయ్యాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికలను సక్సెస్ చేసినట్లు సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఎన్నికల సమయంలో 2,061 కేసులు నమోదవగా, 7,863 మందిని బైండోవర్ చేసినట్లు చెప్పారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి పీడీ యాక్టు కేసులు తగ్గాయి. నిరుడు గూండాలు, వైట్ కాలర్ నేరస్థులు, గంజాయి స్మగ్లింగ్ కు సంబంధించి 18 మందిని పీడీ యాక్టు కింద బుక్ చేశారు. ప్రెస్మీట్లో వరంగల్ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్ల డీసీపీలు ఎంఏ బారి, రవీందర్, సీతారామ్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎం.జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులపై దాడులు తగ్గిస్తాం
కమిషనరేట్ పరిధిలో నమోదయ్యే కేసులను ఛేదించేందుకు స్పెషల్‌ఫోకస్ పెడుతున్నాం. మహిళలు, చిన్నారులపై దాడులు పెరగకుండా యాక్షన్తీసుకుంటున్నాం. సీసీ కెమెరాల ఏర్పాటుతో చోరీలను నియంత్రిస్తున్నాం. ప్రజలకు నిత్యం పోలీసులు అందుబాటులో ఉంటున్నారు. కమిషనరేట్పరిధిలో భూదందాలకు పాల్పడితే విచారణ చేపట్టి కఠిన చర్యలు చేపడతాం. అంబర్కిశోర్ ఝా, వరంగల్ సీపీ