ఖమ్మం జిల్లాలో పెరిగిన నేరాలు .. క్రైమ్​ రిపోర్ట్​ విడుదల

ఖమ్మం జిల్లాలో పెరిగిన నేరాలు .. క్రైమ్​ రిపోర్ట్​ విడుదల
  • పెద్ద సంఖ్యలో సైబర్ మోసాలు
  • ఈ ఏడాదిలో ఏకంగారూ.35 కోట్లు స్వాహా 
  • పోలీసులు రికవరీ చేసింది రూ.52 లక్షలే
  • గోల్డెన్​ అవర్​లో ఫిర్యాదు చేస్తే మేలంటున్న పోలీసులు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేటు 16 శాతం పెరిగింది. ఆర్థిక నేరాల్లో పోలీసుల రికవరీ శాతం తగ్గింది. సైబర్​నేరగాళ్లు పెద్ద సంఖ్యలో జనాల నెత్తిన కుచ్చుటోపీ పెట్టారు. ఇండ్లలో దొంగతనాలు, చీటింగ్ కేసులు, రోడ్ యాక్సిడెంట్లు, కిడ్నాప్, మిస్సింగ్ కేసులు బాగా పెరిగాయి. చిన్నమొత్తమైనా కేసులు నమోదు చేయడం వల్ల ఈ ఏడాది ఎఫ్ఐఆర్ ల సంఖ్య పెరిగినట్టు కనిపిస్తోందని సీపీ​సునీల్ దత్ తెలిపారు. ఈ ఏడాది క్రైమ్ ట్రెండ్స్ ను శనివారం ఆయన వెల్లడించారు. ఆన్​ లైన్​మోసాలకు సంబంధించి జార్ఖండ్​ కు చెందిన కొందరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది వరదల సమయంతోపాటు వివిధ కేసుల పరిష్కారంలో కృషి చేసిన పోలీస్​సిబ్బందిని ఆయన అభినందించారు. 

భారీగా పెరిగిన సైబర్ నేరాలు

ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది సైబర్​ నేరాలు భారీగా పెరిగాయి. వివిధ పోలీస్ స్టేషన్లలో 276 కేసులు నమోదు కాగా, గతేడాది ఈ మొత్తం 219 మాత్రమే. సైబర్​నేరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఎస్​లో గతేడాది 1,332 ఫిర్యాదులు రాగా, ఈసారి 2,148కి పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఇది 63 శాతం ఎక్కువ. ఇక ఈ నేరాలన్నింటిలో కలిపి సైబర్ నేరగాళ్లు రూ.34.92 కోట్లు కొల్లగొట్టారు. గతేడాది ఈ మొత్తం 9.07 కోట్లుగా ఉంది. సైబర్ మోసం జరిగిన గంటలోపే బాధితులు ఫిర్యాదు చేయడంతో రూ.2.42 కోట్లను పోలీసులు హోల్డ్ లో పెట్టగలిగారు. మరో రూ.52 లక్షలను రికవరీ చేశారు. సైబర్​ నేరాల్లో ఆన్​లైన్​ద్వారా లోన్లు, ఇన్వెస్ట్ మెంట్, జాబ్ ఫ్రాడ్​మోసాలే ఎక్కువగా జరిగాయి. 

పెడ్లర్లు రూటు మార్చడంతో తగ్గిన గంజాయి పట్టివేత

నార్కోటిక్​డ్రగ్స్​కు సంబంధించి గతేడాది 41 కేసులు నమోదు కాగా, ఈ సారి 35కి తగ్గింది. ఈ ఏడాది 384 కిలోల గంజాయిని సీజ్​ చేయగా, అంతకు ముందు నుంచి నిల్వ ఉన్న 855 కేజీలను ధ్వంసం చేశారు. ఖమ్మం జిల్లాలో వాహనాల తనిఖీ ఎక్కువ కావడంతో గంజాయి పెడ్లర్లు రూటు మార్చారని, ఏవోబీ నుంచి కొత్తగూడెం, ఇల్లందు మీదుగా ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా జరుగుతుందని సీపీ తెలిపారు. ఖమ్మానికి బైక్​ లు, కార్ల ద్వారా కొద్ది మొత్తంలోనే గంజాయి వస్తుందని, దాన్ని కూడా కట్టడి చేస్తున్నామని వివరించారు.