కరీంనగర్​లో క్రైమ్​ రేట్ భారీగా పెరిగింది.. కిందటేడుతో పోలిస్తే అధికమైన సైబర్​క్రైమ్స్ 

  •     రూ.11.48కోట్లు నష్టపోయిన 1,608 మంది బాధితులు
  •     జిల్లా వ్యాప్తంగా పెరిగిన చోరీ కేసులు 
  •     మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల కేసులూ ఎక్కువే 
  •     యాన్యువల్​క్రైమ్​రిపోర్టును రిలీజ్ చేసిన సీపీ అభిషేక్ మహంతి 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పోలీస్​కమిషనరేట్ పరిధిలో క్రైమ్​రేట్​భారీగా పెరిగింది. కిందటేడుతో పోలీస్తే నేరాలు తగ్గకపోగా, అధిక సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2022లో అన్ని రకాల కేసుల్లో కలిపి 4,769 ఎఫ్ఐఆర్​లు నమోదుకాగా, 2023లో 5,908 నమోదయ్యాయి. ఇందులో సైబర్ క్రైమ్స్ పర్సంటేజీ ఎక్కువగా ఉంది.

చోరీలు, మహిళలపై వేధింపులు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో 202 మంది చనిపోయారు. మొత్తంగా గతేడాదితో పోలిస్తే క్రైమ్​రేట్​23.88 శాతం పెరిగింది. సైబర్​క్రైమ్​రేట్​20.35 అధికమైంది. ఈ మేరకు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి గురువారం కమిషనరేట్​లో యాన్యువల్ రిపోర్టు రిలీజ్​చేశారు. 

ఫ్రాడ్​కాల్స్.. వెబ్​లింక్స్

బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఫ్రాడ్ కాల్స్, వాట్సాప్​లో వెబ్ లింక్స్, ఆన్ లైన్ గేమ్స్ తోపాటు మరికొన్ని విధాలుగా1,608 మంది బాధితులు సైబర్​నేరగాళ్ల చేతిలో మోసపోయారు. రూ.11.48 కోట్లు పోగొట్టుకున్నారు. కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.1.70 కోట్లను వివిధ బ్యాంకుల్లో సీజ్​చేయించారు. సైబర్​క్రైమ్స్​లో మొత్తంగా 219 ఎఫ్ఐఆర్​లు నమోదుకాగా, 32 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గత ఏడాది 1,336 ఫిర్యాదులు రాగా,  బాధితులు 4.46 కోట్లు నష్టపోయారు.

నిరుడితో పోలిస్తే ఈసారి సైబర్ నేరగాళ్లు దోచేసిన సొత్తు మూడు రెట్లు అధికంగా ఉంది. గతేడాది అన్ని రకాల చోరీలు కలిపి 248 కేసులు నమోదైతే, ఈ ఏడాది 330 కేసులు నమోదయ్యాయి. చోరీకి గురైన సొత్తు విలువ రూ.2.11 కోట్లు కాగా, 143 కేసుల్లో దొంగలను గుర్తించి ఇప్పటి వరకు రూ.94.91 లక్షల విలువైన సొత్తును పోలీసులు రికవరీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మహిళలపై వేధింపులకు సంబంధించి నిరుడు 498 కేసులు నమోదుకాగా, ఈసారి ఆ సంఖ్య 565కు పెరిగింది.

అట్రాసిటీ కేసులు నిరుడు 109 కేసులు నమోదు కాగా, ఈసారి 127 కేసులు నమోదయ్యాయి.  నిరుడు 34 రేప్ కేసులు, 68 పోక్సో కేసులు ఫైల్​అవగా, ఈసారి 25 రేప్, 58 పోక్సో కేసులు నమోదయ్యాయి. షీ టీమ్స్ కు 201 ఫిర్యాదులు అందాయి. అందులో 10 ఎఫ్ఐఆర్, 100 ఈ–పెట్టి కేసులు నమోదు చేశారు. 38 మంది ఆకతాయిలకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.

సీపీ ఆఫీసుకు 3,113 ఫిర్యాదులు

ఈ ఏడాది సీపీ ఆఫీసుకు మొత్తం 3,113 ఫిర్యాదులు అందాయి. ఇందులో సీసీసీ ద్వారా వచ్చినవి 1,268, ప్రజావాణి, పోలీస్ ఉన్నత అధికారులు, సీఎంఓ నుంచి వచ్చినవి 1,845 ఉన్నాయి. 2,866 ఫిర్యాదులను పోలీసులు పరిష్కరించారు. మిగతావి విచారణ దశలో ఉన్నాయని సీపీ అభిషేక్ మహంతి వెల్లడించారు.

అలాగే డయల్100కు 43,199 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఇసుకను అక్రమ రవాణాపై ఫోకస్​పెట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు పట్టుబడ్డ 52 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. 10 లారీలు, 3 టిప్పర్లు, 9 జేసీబీలు, పిక్ అప్ వెహికల్ ఒకటి, 219 ట్రాక్టర్లు కలిపి మొత్తం 242 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.

47 మందికి జైలు శిక్ష

ఈ ఏడాది మొత్తం 1,991 కేసులు కోర్టు ద్వారా పరిష్కారమయ్యాయి. వీటిలో 765 కేసుల్లో శిక్షలు విధించగా, 618 కేసులు లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యాయి. శిక్షలు పడిన కేసుల్లో నలుగురికి జీవిత ఖైదు, ఒకరికి 20 ఏళ్ల కారాగారశిక్ష, ఒకరికి పదేళ్ల జైలు, నలుగురికి ఏడేళ్ల జైలు, ఒకరికి ఐదేళ్ల జైలు, ఒకరికి నాలుగేళ్ల జైలు, 11 మందికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఇద్దరికి రెండేళ్లు, 22 మందికి ఏడాది జైలు శిక్ష విధించారు.  

పెరిగిన యాక్సిడెంట్లు 

నిరుడు జిల్లాలో 621 యాక్సిడెంట్లు జరగగా, 214 మంది చనిపోయారు. 587 మందికి గాయపడ్డారు. ఈ ఏడాది 653 యాక్సిడెంట్లు జరగగా, 202 మంది మృత్యువాత పడ్డారు. 612 మందికి గాయాలయ్యాయి.  3,52,013 ఎంవీ యాక్ట్ వయోలేషన్​కేసులు నమోదు చేయగా, ఇందులో 5,092 డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. నిరుడితో పోలిస్తే ఈసారి డ్రంకెన్ డ్రైవ్ కేసులు తగ్గాయి.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో  రూ.4.4 కోట్ల నగదు, 1.89 లక్షల గంజాయి, 19.11 లక్షల విలువైన 2,641 లీటర్ల లిక్కర్, 8.59 లక్షల విలువైన ఆభరణాలు, 2.38 లక్షల విలువైన పరికరాలను పోలీసులు సీజ్ చేశారు.  ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు 185 కేసులు నమోదు చేశారు. గంజాయి, డ్రగ్స్​కు సంబంధించి గతేడాది 22 కేసులు నమోదైతే, ఈ  ఏడాది 22 కేసుల్లో 45 మందిని జైలుకి పంపారు. వీరిలో ఐదుగురిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. 447 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు 408 మందిని పోలీసులు గుర్తించారు.