కరోనా ఎఫెక్ట్.. తగ్గిన క్రైం రేట్​

సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు :  కరోనా ఎఫెక్ట్ తో జిల్లాలో క్రైం రేటు పూర్తిగా తగ్గిపోయింది. లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగేవి. కానీ ప్రస్తుతం వెహికిల్స్ రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. మార్చి 1వ తేదీ నుంచి 21 వరకు 18 ప్రమాదాలు జరుగగా, లాక్ డౌన్ విధించిన తర్వాత ఇప్పటివరకు కేవలం మూడు యాక్సిడెంట్లు మాత్రమే జరుగగా ఎవరూ చనిపోలేదు. ప్రమాదాలతో పాటు ఇతర నేరాలు కూడా పూర్తిగా తగ్గాయి.

లాక్ డౌన్ కు ముందు 1,445.. తర్వాత 20

లాక్ డౌన్‌కు ముందు ప్రతి రోజు జిల్లాలో ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతుండేవి. దీంతో పాటు వివిధ నేరాలకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రతి రోజు ఒక్క కేసైనా ఉండేదని పోలీసులు అంటున్నారు. ఇలా జనవరి నుంచి మార్చి 21 వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,445 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత 20 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 75 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 82 ప్రమాదాలు జరగడంతో పలువురు చనిపోయారు. దీనికి తోడు డ్రంక్ అండ్ డ్రైవ్, చోరీలు, మర్డర్లు, హత్యాయత్నాలతో పాటు అక్రమ ఇసుక రవాణా వంటి కేసులు కూడా వందలాదిగా నమోదయ్యాయి.

ఇండ్లకే పరిమితమైన జనం

కరోనా వ్యాప్తి చెందుతుండడంతో మార్చి 22న కేంద్రం జనతా కర్ఫ్యూను ప్రకటించింది. 23 నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జనం సైతం ఇండ్లకే పరిమితం అయ్యారు. దీంతో రోడ్డు ప్రమాదాలతో పాటు, వివిధ రకాల కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. మద్యం షాపులు కూడా బంద్ చేయడంతో గతంలో ఒక్కో నెలలో 250కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం అవి కూడా ఒక్కటీ నమోదు కాలేదు. లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ప్రజలు బయట తిరిగేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. అత్యవసరమై ఎవరైనా వచ్చినా బైక్‌పై ఒక్కరు, కారులో ఇద్దరికి మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా లోకల్ వారికి మాత్రమే కావడంతో ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. రూల్స్ పాటించకుండా రోడ్లపైకి వస్తే వెంటనే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు, భారీ జరిమానాలు సైతం విధిస్తున్నారు. ఇక గ్రామాల్లో సైతం లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేస్తుండడంతో చోరీలు, గొడవలు, హత్యలు, అక్రమ రవాణా వంటివి తగ్గిపోయాయి. అయితే లాక్‌డౌన్ పెద్ద సవాలే అయినప్పటికీ సాధారణ కేసుల నుంచి ఉపశమనం లభించిందని పోలీసులు  అంటున్నారు.