మెదక్ ​జిల్లాలో పెరిగిన క్రైమ్​రేట్​

మెదక్ ​జిల్లాలో పెరిగిన క్రైమ్​రేట్​
  • ఉమ్మడి మెదక్ ​జిల్లాలో పెరిగిన కేసుల సంఖ్య
  •  మహిళలపై ఎక్కువైన వేధింపులు 
  • హత్యలు, చోరీలు, డ్రంకెన్​డ్రైవ్ కేసులు అధికంగా నమోదు

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా క్రైమ్​రేట్​పెరిగింది. మెదక్​ జిల్లాలో అన్ని రకాల కేసులు కలిపి మొత్తం 4,187 నమోదవగా, ఇది గతేడాది కంటే 14.04 శాతం ఎక్కువ. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 7,563 కేసులు నమోదవగా, ఇది గతేడాది కంటే 5 శాతం ఎక్కువ. సిద్దిపేట జిల్లాలో మొత్తం 6,223 కేసులు నమోదు కాగా, ఇది గతేడాది కంటే 5 శాతం ఎక్కువ.  

మెదక్​ జిల్లాలో..

జిల్లాలో గతేడాదితో పోలిస్తే మహిళలపై భర్తల వేధింపులు ఎక్కువయ్యాయి. 2023లో జిల్లాలో 154 కేసులు నమోదు కాగా ఈ సారి నవంబర్​ 30 వరకు169 కేసులు నమోదయ్యాయి. మహిళల హత్యలు పోయిన సారి 10 జరుగగా ఈ సారి 11 అయ్యాయి. రేప్​లు గతేడాది 37 జరిగితే ఈ ఏడు 48 జరిగాయి. పోయిన సారి 34 మంది మహిళలు కిడ్నాప్​ కు గురైతే ఈ సారి 37 మంది కిడ్నాప్​ అయ్యారు. ఈవ్​ టీజింగ్ కేసులు పోయిన సారి ఒకటి నమోదవగా ఈ యేడు 4 కేసులు నమోదయ్యాయి. 

 ఎస్పీ, ఎస్టీలకు సంబంధించి 2023లో 31 కేసులు నమోదు కాగా 2024లో 48 కేసులు నమోదయ్యాయి. మిస్సింగ్​ కేసులు 387 నమోదవగా వారిలో 362  మందిని పోలీసులు ట్రేస్​ చేశారు. నార్కోటిక్​ డ్రగ్​ కేసులు ఈ సారి 8 నమోదు కాగా 17 మందిని అరెస్ట్​ చేసి వారి నుంచి రూ.19,86,750 విలువైన 99 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సైబర్​ క్రైమ్ కేసులు 63 నమోదవగా రూ.2,88,44,242 నష్టపోగా రూ.30,80,564 రీఫండ్​ అయింది. 

రోడ్డు ప్రమాదాలు గతేడాదితో పోలిస్తే ఈ సారి పెరిగినప్పటికీ మరణాల సంఖ్య తగ్గింది. జిల్లాలోని వివిధ హైవేలు, రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రోడ్ల మీద 2023లో 562 ప్రమాదాలు జరిగి 323 మంది  చనిపోగా, 480 మంది గాయపడ్డారు. ఈ సారి 568 ప్రమాదాలు జరుగగా 302 మంది మృత్యువాత పడ్డారు.459 మంది గాయపడ్డారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 4,740 డ్రంకన్ ​డ్రైవ్​ కేసులు నమోదవగా 10 మందికి శిక్ష పడింది. ఈ సారి 6,563 కేసులు నమోదు కాగా 11 మందికి జైలు శిక్ష పడింది. 

ఈ ఏడాది 38 పేకాట కేసులు నమోదు కాగా రూ.9,70,082 సీజ్​ చేశారు. భరోసా కేసులు మొత్తం 71 నమోదవగా 86 మంది నిందితులను అరెస్ట్​ చేశారు. అందులో నాలుగు కేసుల్లో నేరస్థులకు శిక్ష పడింది. ఆయా కేసుల్లో బాధితులకు రూ.22 లక్షల పరిహారం అందింది.  దొంగతనాల్లో ఆస్తి రికవరీలో పోలీసులు కొంత పైచేయి సాధించారు. 2024లో రూ.3.36 కోట్ల ఆస్తి చోరీకి గురికాగా అందులో రూ.1.22 కోట్లు రికవరీ చేశారు. గతేడాదితో పోలిస్తే 1.42 శాతం ఎక్కువ రికవరీ అయింది.  

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధితో గతేడాది మొత్తం 5,931 కేసులు నమోదవగా ఈ ఏడు 6,233 కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం 25 మర్డర్ కేసులు నమోదు కాగా 709  చోరీ  కేసుల్లో  40 శాతం సొత్తును రికవరీ చేశారు. కమిషనరేట్ పరిధిలో  91 పోక్సో కేసులు, 75 రేప్ కేసులు, 9  చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి.  655 రోడ్డు ప్రమాదాల్లో 283 మంది చనిపోగా 561 మంది గాయపడ్డారు. 12,681 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 45 మందికి జైలు శిక్ష విధించారు. గంజాయి కేసులు 14  నమోదవగా వేగంగా వెళ్లే వాహనాలను స్పీడ్ లేజర్ గన్ ద్వారా గుర్తించి 43,594 కేసులు నమోదు చేసి రూ.45 లక్షల  జరిమానా విధించారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై 219 కేసులు నమోదు చేసి 412 మందిని అరెస్టు చేశారు.

 199 సైబర్ కేసులు నమోదవగా రూ.69.71 లక్షలు ఫ్రీజ్ చేయగా, 80 పేకాట కేసుల్లో 511 మందిని అరెస్టు చేసి రూ.17.31 లక్షలు సీజ్ చేశారు. 32 గుట్కా అమ్ముతున్న కేసులు, నకిలీ విత్తనాలకు సంబందించి మూడు కేసులు నమోదు చేశారు. బెల్ట్ షాపులపై రైడ్  చేసి 404 కేసులు నమోదు చేయగా సీఈఐఆర్ ద్వారా 1,369 ఫోన్స్ ను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 21,249 కేసులకు పరిష్కారం చూపారు.  ట్రాఫిక్  నిబంధనలు ఉల్లంఘించినవారిపై 3,45,816 కేసులు,  రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 145 కేసులు నమోదు చేశారు.

సంగారెడ్డి  జిల్లాలో..

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో 7,563 కేసులు నమోదయ్యాయి. అందులో 283 కేసులను తీవ్రమైనవిగా పరిగణించారు. సంగారెడ్డి, పటాన్ చెరు, అమీన్ పూర్, సదాశివపేట, జహీరాబాద్ పట్టణ ప్రాంతాల్లో 793 సైబర్ కేసులు నమోదవగా అందులో రూ.47 కోట్లకు పైగా బాధితులు డబ్బు పోగొట్టుకున్నారు. పోక్సో కేసులు 168 నమోదయ్యాయి. 284 మంది హత్యకు గురికాగా ఇందులో 55 సాధారణ హత్యలు, 10 ఆస్తి కోసం జరిగిన హత్యలు, 88 అపహరించి చేసిన హత్యలు, 131 హత్యాచారం చేసిన హత్యలు ఉన్నాయి. గంజాయి కేసులు 26 నమోదవగా, 508.72 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 

దోపిడీలు, చోరీలకు సంబంధించి మొత్తం 937 కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో 11 మందికి జీవిత ఖైదు పడింది. జిల్లాలో మొత్తం 2,149 రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో 384 మంది చనిపోయారు. డ్రంకన్​డ్రైవ్ కేసులు మొత్తం 8,676 నమోదవగా 65 మందికి జైలు శిక్ష పడింది. రూ.1,13,50,293 జరిమానా విధించారు. చీటింగ్ కేసులు 196 నమోదయ్యాయి. మహిళలకు సంబంధించిన నేరాలు 504 జరిగాయి. 804 మిస్సింగ్ కేసులు నమోదవగా ,105 పేకాట కేసులు, 13 మట్కా కేసులు నమోదయ్యాయి. 34 గంజాయి కేసులు నమోదు కాగా 79 మందిని అరెస్టు చేశారు. పీడీఎస్​ఎస్ తరలింపునకు సంబంధించి 85 కేసులు నమోదు చేశారు. ఇసుక అక్రమ రవాణా కేసులు 45 నమోదయ్యాయి. ఈ ఏడాది 1,845 కేసులు లోక్ అదాలత్​లో పరిష్కారమయ్యాయి.