నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో పెరిగిన క్రైమ్ రేట్

నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో పెరిగిన క్రైమ్ రేట్

నల్గొండ, యాదాద్రి, వెలుగు : నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో ఈ ఏడాది క్రైమ్ రేట్ పెరిగింది. సైబర్ క్రైమ్ బాధితులు పెరిగిపోతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటున్నారు. మహిళలపై వేధింపులు పెరిగాయి. ఆయా జిల్లాలకు సంబంధించిన క్రైమ్ రేట్​ను పోలీస్ డిపార్ట్​మెంట్ విడుదల చేసింది. నల్గొండ జిల్లాలో 2023లో 7,901 కేసులు నమోదు కాగా, 2024లో 8,695 కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో యానివల్ క్రైమ్ రివ్యూ నిర్వహించి వివరాలను వెల్లడించారు.

 
పెరిగిన క్రైమ్ రేట్..

జిల్లాలో గతేడాది 7,901 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 8,695 కేసులు నమోదయ్యాయి. మహిళలపై వేధింపుల కేసుల్లో గతేడాది 98 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 100 కేసులు నమోదయ్యాయి. 43 హత్యలు జరగగా, 56 మందిపై హత్యాయత్నం జరిగింది. 10 దోపిడీ, 2 డెకాయిట్​ కేసులు నమోదు చేశారు. గతేడాది 522 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 479 నమోదయ్యాయి. పీడీఎస్ అక్రమ రవాణాలో గతేడాది 77 కేసులు నమోదు కాగా, ఈసారి 217 నమోదు చేశారు. అక్రమ ఇసుకపై గతేడాది 421 కేసులు, ఈ ఏడాది 482 నమోదు చేశారు. గేమింగ్ యాక్ట్ కింద గతేడాది 28 కేసులు నమోదు కాగా, ఈసారి 60 నమోదయ్యాయి. పశువులు అక్రమ రవాణాలో 28 మందిపై కేసులు నమోదు చేశారు. 

సైబర్ నేరాలు తగ్గినా.. అమౌంట్​ పెరిగింది

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాల కేసులు తగ్గినా బాధితులు మాత్రం పెద్ద ఎత్తున నగదు కోల్పోయారు. 2023లో 276 కేసులు నమోదు కాగా, బాధితుల నుంచి రూ.81.77 లక్షల నగదు కొట్టేశారు. వీటిలో రూ.9.64 లక్షలను పోలీసులు రికవరీ చేశారు. ఈ ఏడాదిలో మాత్రం 135  కేసులు నమోదు కాగా, రూ.4,55,55,821 కాజేశారు. ఇందులో సైబర్ నేరగాళ్ల నుంచి రూ.85.90 లక్షలను రికవరీ చేశారు. 

తగ్గిన రోడ్డు ప్రమాదాలు..

2023తో పోలిస్తే 2024లో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గతేడాది 369 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో 399 మంది మృతి చెందగా, 829 మంది గాయపడ్డారు. ఈ ఏడాది 351 రోడ్డు ప్రమాదాలు జరిగితే 373 మంది మృతి చెందగా, 756 మంది గాయపడ్డారు. 

36 శాతం దొంగసొత్తు రికవరీ..

దొంగతనం కేసుల్లో 36.68 శాతం సొత్తు రికవరీ చేశారు. ఈ ఏడాది జరిగిన 550 దొంగతనాల్లో  రూ.14.13 కోట్లు చోరీ చేశారు. దీనిలో రూ.5.06 కోట్లు రికవరీ చేశారు. కట్టంగూరు పరిధిలో ఒక గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతూ ఒకరిని హత్య చేయగా ఈ కేసును పోలీసులు 6 నెలల వ్యవధిలోనే చేధించారు. డమ్మీ పిస్టోల్ తో ప్రజలను బెదిరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రూ.90 లక్షల విలువైన వాహనాలను పట్టుకున్నారు. 

యాదాద్రి జిల్లాలో పెరిగిపోతున్న సైబర్​ క్రైమ్..

గతంతో పోలిస్తే యాదాద్రి జిల్లాలో సైబర్​ క్రైమ్​ రేట్​ పెరిగిపోయింది. 2022లో 13 కేసులు నమోదు కాగా 2023లో 52 కేసులు నమోదయ్యాయి. బాధితులు రూ.40 లక్షలకు పైగా కోల్పోయారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 132 సైబర్​ క్రైమ్ నమోదయ్యాయి.  

పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. గంజాయి రవాణా..

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని రిపోర్ట్​లో పోలీసులు వెల్లడించారు. 2023లో 565 రోడ్డు ప్రమాదాలు జరగగా, 214 మంది చనిపోయారు. ఈసారి కూడా 589 రోడ్డు ప్రమాదాలు జరగగా, 200 మంది చనిపోయారు.  జిల్లాలో ఇతర మత్తు పదార్థాల రవాణా పెరిగింది. 2023లో 29 కేసులు నమోదు కాగా, 1781.148 కేజీల గాంజా, 3.5 లీటర్ల హాష్​ఆయిల్​, 41 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఏడాదిలో 32 కేసులు నమోదు కాగా దాదాపు 1001 కిలోల గంజాయి, 11.344 లీటర్ల హాష్​ఆయిల్, పెప్పిస్ట్రా డ్రగ్ 5050 గ్రాములు, ఎంఎండీఏ 102.3 గ్రాములు, మెపోడ్రోన్​ డ్రగ్​ 101.35 గ్రాములు, అల్ప్రాజోమ్​ డ్రగ్​415 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. 

256  మందికి శిక్షలు.. ఇద్దరు ఆత్మహత్య..

న్యాయస్థానంలో ఈ ఏడాది నిందితులకు శిక్షలు పడే విధంగా పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారు. వివిధ కేసుల్లో 256 మందికి శిక్షలు పడే విధంగా సాక్షాలు సమర్పించారు. మోటకొండూరు మండలంలో జరిగిన ఓ హత్య కేసులో 14 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. లోక్​ అదాలత్​లో 1657 కేసులు పరిష్కారమయ్యాయి. వివిధ కేసులకు సంబంధించి 5,817 ఎఫ్​ఐఆర్​లు ​నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3న జరిగిన ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. పదో తరగతి చదువుతున్న కోడి భవ్య, గాదె వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 

కాస్త తగ్గిన పోక్సో కేసులు, లైంగిక దాడులు, చోరీలు, హత్యలు..

జిల్లాలో గతంతో పోలిస్తే పోక్సో కేసులు, లైంగిక దాడులు తగ్గాయి. 2023లో పోక్సో కేసులు 68 నమోదు కాగా, ఈ ఏడాది 66 నమోదయ్యాయి. 2023లో 59 మందిపై లైంగిక దాడి జరగగా, ఈ ఏడాదిలో 44కి తగ్గింది. అయితే మహిళలపై కుటుంబ హింస సహా వివిధ రూపాల్లో దాడులు జరిగాయి. ఇప్పటివరకు 361 కేసులు నమోదయ్యాయి. 2022లో 14 మంది హత్యకు గురికాగా, 2023లో 12కు తగ్గాయి. ఈసారి 11 హత్య కేసులు నమోదయ్యాయి. అయితే క్రైమ్ రిపోర్ట్​లో ఆత్మహత్యలు, కిడ్నాప్​ వివరాలు వెల్లడించలేదు. 2023లో 467 దొంగతనాలు జరిగాయి. ఈసారి 442 దొంగతనాలు జరగగా 3.30 కోట్లు చోరీ చేశారు. వీటిలో రూ. 2.40 కోట్లు రికవరీ చేశారు.

మిషన్ పరివర్తనతో మార్పు 

జిల్లాలో చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం ద్వారా గంజాయి నిర్మూలనను విజయవంతంగా అరికడుతున్నాం. జిల్లా వ్యాప్తంగా 3,542 కార్యక్రమాలు చేపట్టాం. 715 స్కూల్స్, కాలేజీల్లో గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. 377 మందిని గంజాయి తాగుతున్న వారిని గుర్తించాం. 

ఎస్పీ శరత్ చంద్ర పవార్