- 2868 సైబర్ నేరాల్లో రూ.301కోట్లు లూఠీ
- 322 డ్రగ్స్, గంజాయి కేసుల్లో 1508 మంది అరెస్ట్
- 5643 ప్రాపర్టీ క్రైమ్స్ నమోదు ,తగ్గిన రికవరీ
- పెరిగిన కన్విక్షన్ రేట్ 68 శాతం
- రోడ్డు ప్రమాదాల్లో 227 మంది మృతి
- వచ్చే ఏడాది డ్రోన్స్ మెయింటెనెన్స్ వింగ్ ఏర్పాటు
- ఏడాది రిపోర్ట్ రిలీజ్చేసిన సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు : నగరంలో నేరాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉందని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో 2024 అన్యూవల్ రిపోర్ట్ విడుదల చేశారు. అడిషనల్ సీపీ(ట్రాఫిక్) విశ్వప్రసాద్,అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్వేత, టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర, అన్ని జోన్ల డీసీపీలతో కలిసి వివరాలు వెల్లడించారు.
ప్రాపర్టీ నేరాలు కొంత వరకు తగ్గాయని.. సైబర్, ఆర్థిక నేరాలు భారీగా పెరిగిపోతున్నాయన్నారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 40 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు తగ్గాయన్నారు. 2025లో డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, లా అండ్ ఆర్డర్ కోసం డ్రోన్స్ మెయింటెనెన్స్ వింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
88 శాతం పెరిగిన కిడ్నాప్ కేసులు
గతేడాది ఓవరాల్‌గా 25,488 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఈ ఏడాది 35,944 రిపోర్ట్ అయ్యాయని సీపీ తెలిపారు. ప్రతి ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్ చేస్తున్నందు వలకల 40 శాతం అధికంగా రిజిస్టర్ అయ్యాయన్నారు. హత్యలు 13 శాతం తగ్గడంతో పాటు హత్యాయత్నం కేసులు తగ్గాయన్నారు. కిడ్నాప్ కేసుల్లో 88 శాతం పెరుగుదల ఉందని, అనుమానాస్పదంగా, తప్పిపోయిన మహిళల కేసులను కూడా కిడ్నాప్ కేసులుగా పరిగణిస్తుండడంతో పెరుగుదల ఉందన్నారు.
ప్రాపర్టీ అఫెన్సెస్‌లో 59 శాతం ఛేదించామని, రియల్ ఎస్టేట్ పేరుతో జరుగుతున్న మోసాలకు సంబంధించిన కేసుల్లో ప్రాపర్టీల అటాచ్‌మెంట్ చేస్తున్నట్లు సీసీఎస్ డీసీపీ శ్వేత తెలిపారు. ధన్వంతరీ కేసులో 88 ప్రాపర్టీస్‌ను అటాచ్ చేశామని, ప్రాపర్టీ వేలానికి కోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయన్నారు.
డయల్100తో ఏడు నిమిషాల్లోనే క్రైమ్స్పాట్కు..
కమిషనరేట్పరిధిలో బోనాలు, గణేశ్ఉత్సవాలు సహా అన్ని పండగలు ప్రశాంతంగా ముగిశాయని సీపీ తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఈ ఏడాది విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. డయల్100కు వచ్చే కాల్స్ ద్వారా క్రైమ్ జరిగినప్పుడు ఏడు నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే స్పాట్‌కు చేరుకుంటున్నామన్నారు.
129 పెట్రోల్ కార్స్, 210 బ్లూ కోల్ట్స్, ఇంటర్ సెప్టర్ వెహికిల్స్ తో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గణేశ్ ఉత్సవాల తర్వాత సౌండ్ పొల్యూషన్ లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి ఆపరేషన్ రోప్‌ను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కట్టడి చేయడంలో టాస్క్ ఫోర్స్ మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని సీపీ వెల్లడించారు. ఓల్డ్ సిటీ సహా సిటీలో పాడైపోయిన సీసీటీవీ కెమెరాలను రిపేర్ చేయిస్తామన్నారు.
డిజిటల్అరెస్టు కేసులే ఎక్కువ
డిజిటల్ అరెస్ట్ సహా మొత్తం 36 రకాల నేరాలతో సైబర్ చీటర్స్ రెచ్చిపోతున్నారని సీపీ తెలిపారు. ఈ ఏడాది డిజిటల్ అరెస్ట్ కేసులే ఎక్కువ శాతం రిపోర్ట్ అయ్యాయన్నారు. సిటీ సైబర్ క్రైమ్ పీఎస్‌లో 2,868 కేసులు నమోదు కాగా, రూ.301 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారన్నారు. ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు.
బాధితులు కోల్పోయిన రూ.42 కోట్లు రికవరీ చేశామన్నారు. సైబర్ క్రైమ్ కేసుల్లో 30 శాతం కేసులను డిటెక్షన్ చేసి 500 మందికి పైగా సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేశామని సీపీ వెల్లడించారు. ఈ ఏడాది 322 డ్రగ్స్ కేసులు నమోదు చేసి 1508 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఇందులో 43 మంది ఫారినర్స్ ఉన్నట్లు చెప్పారు. డ్రగ్స్, సైబర్ నేరాల్లో అరెస్ట్ చేసిన విదేశీయులను వారి దేశాలకు డిపోర్ట్ చేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఏడాది 2023 2024
ఓవర్ ఆల్ క్రైమ్ 25,488 35,944
హత్యలు 89 77
హత్యాయత్నాలు 274 214
కిడ్నాప్‌లు 172 324
చీటింగ్ 5250 5303
అల్లర్లు 17 19
దోపిడీలు 16 29
ఇళ్లలో చోరీలు 912 1294
చైన్ స్నాచింగ్ 35 24
బైక్స్ చోరీలు 1470 2091
సర్వెంట్ థెఫ్ట్ 116 173
సైబర్ నేరాలు
(ఎన్సీసీఆర్పీ) 21,878 25,831